సీబీఐ చీఫ్‌గా సుభోద్ కుమర్ జైస్వాల్ పేరు ఖరారయింది. నిన్నామొన్నటి వరకూ ఆయన పేరు పెద్దగా రేసులో లేదు. ఎక్కువగా వినిపించిన పేరు రాకేష్ ఆస్తానా. ఆయన గతంలో సీబీఐలో పని చేశారు. కానీ ఓ వివాదంలో ఆయనను పక్కన పెట్టారు. వేరే పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయనను సీబీఐ చీఫ్ చేయాలని చాలా ప్రయత్నాలు కేంద్రం వైపు నుంచి జరిగాయి. ఈయన కోసమే చాలా కాలంగా సీబీఐ చీఫ్ పోస్టును భర్తీ చేయకుండా… ఇంచార్జ్తో నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక వేళ ఆస్థానా కాకపోతే.. మరో ఇద్దరి పేర్లను స్టాండ్‌బై పెట్టుకున్నారు. వారంతా… కేంద్ర ప్రభుత్వ పెద్దల నమ్మిన బంట్లు. అయితే.. సీబీఐ చీఫ్ ఎంపిక ఒక్క ప్రధాని చేతుల్లోనే ఉండదు. దీంతో కథ తారుమారయింది.
సీబీఐ చీఫ్ ఎంపికను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నేత, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉన్న కమిటీ చేస్తుంది. ఈ కమిటీ రెండు రోజుల కింద ప్రధానమంత్రి ఇంట్లో సమావేశమైంది. ఆ సమయంలో… తమ ఎదుటకు వచ్చిన ప్రాబబుల్స్ నుంచి రాకేష్ ఆస్తానాతో పాటు.. మరో ఇద్దరు కీలక అధికారుల పేర్లను రూల్ అవుట్ అయ్యేలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిబంధనలు గుర్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారులకు… కనీసం ఆరు నెలల పదవీ కాలం ఉంటేనే సీబీఐ చీఫ్‌గా నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు దీంతో వారికి ఆ పదవీ కాలం లేకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. చివరికి ముగ్గురి పేర్లను కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి సుభోద్ కుమార్ జైస్వాల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం జైస్వాల్ సీఐఎస్ఎఫ్ డీజీగా ఉన్నారు.
ప్రస్తుతం సీబీఐకి దేశంలో ఎక్కడా లేనంత ప్రాధాన్యత ఉంది. అది రాజకీయ ఆట వస్తువుగా మారిందని.. అధికారంలో ఉండే వారికి మిత్రపక్షంగా మారి విపక్ష నేతల్ని వెంటాడి.. వేటాడి.. చివరికి.. వారిని అధికార పార్టీలో చేరేలా చేయడానికి … ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి మాత్రమే పని చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో… కేంద్ర ప్రభుత్వ చాయిస్‌కు భిన్నంగా జైస్వాల్‌ను సీబీఐ చీఫ్‌గా నియమించాల్సి వచ్చింది. ఆయన సీబీఐ అనేదానికి కొత్త అర్థం చెబుతారో లేకపోతే… కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసెరిగి వ్యవహరించి.. వ్యవస్థను అదే పతన దిశలోనే ఉంచుతారో వేచి చూడాలి.
సుభోద్ కుమార్ జైస్వాల్ ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ అందరి ప్రశంసలు పొందుతున్నారు. సీబీఐని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి.. రాకేష్ ఆస్తానా వంటి వారు.. చీఫ్ అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయనుకున్నారు. ఆ పరిస్థితిని ఎన్వీ రమణ తెలివిగా తప్పించారన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల్లో వ్యక్తమవుతోంది.