కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలో ఏ దేశంపై చూపనంత ప్రభావాన్ని ఇండియాపై చూపించింది. ఒక వెల్లువలా వచ్చి పడింది. ఆ దెబ్బకు దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. భారత్ దుస్థితి చూసి ప్రపంచ దేశాలన్నీ జాలిపడ్డాయి. తమ శక్తినైనంత మేరు ఊపిరి పోయడానికి ఆక్సిజన్ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వరకూ అన్నీ పంపించాయి. వాటి ద్వారా కొన్ని వందల ప్రాణాలు నిలబడ్డాయి. కానీ…సెకండ్ వేవ్ బారిన పడిన ప్రాణాలు కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. రికార్డులకు ఎక్కింది వేలల్లోనే. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అందర్నీ హోమ్ ఐసోలేషన్‌కు పరిమితం చేస్తూవచ్చారు. ఇప్పుడు… సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ వస్తోంది. ఓ దశలో రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటిపోగా… ఇప్పుడు అవి సగానికి తగ్గాయి.
కరోనా సూపర్ స్ప్రెడర్ రాష్ట్రాలుగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చాలా వేగంగా లాక్ డౌన్ అమలు చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదని వేచి చూడకుండా.. వారికి వారు కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. అందరి కంటే ముందుగా ఢిల్లీ, మహారాష్ట్ర లాక్ డౌన్ అమలుచేశాయి. ఆ ఫలితాలను ఇప్పుడు అక్కడ భారీగా కేసులు తగ్గిపోయాయి. అయినా … ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారం తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు.. తొమ్మిది శాతానికి చేరుకుంది. ఏపీ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఇరవై శాతానికిపైగా ఉంది.
కరోనా కంట్రోల్ అయినా… ఫంగస్‌లు పట్టి పీడిస్తున్నాయి. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లను ఇప్పటి వరకూ గుర్తించారు. బ్లాక్ ఫంగస్ కేసులు… దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి ప్రమాదకరమైనవి కావడంతో… వాటిని కంట్రోల్ చేసే మందుల కోసం ఇప్పుడు హైరానా ప్రారంభమయింది. ఉత్పత్తి ని రెండింతలు చేశామని. .. దిగుమతులు చేసుకుంటున్నామని కేంద్రం చెబుతోంది కానీ… బ్లాక్ ఫంగస్ వల్ల ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా వైరస్ తగ్గినా… ఫంగస్‌లు.. మూడోవేవ్ భయాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉండనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం టీకాల విషయంలో భరోసా ఇవ్వలేకపోయింది. కనీసం ధర్డ్ వేవ్ విషయంలోనూ గందరగోళంగా వ్యవహరిస్తోంది. పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఓ సారి.. ఉండదని మరోసారి ప్రకటనలు చేస్తోంది. నిపుణులు కూడా… డివైడ్ అయిపోయారు. కోవిడ్ విషయంలో ప్రభుత్వ వ్యవస్థకు సరైన దృక్పథం లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. ఆ కష్టాలను ప్రజలు అనుభవిస్తున్నారు.