‘స్వాతి పుస్తకంలోని సుఖ సంసారంలోని ఓ పాఠకుడు అడిగిన ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది” అని… రచయిత మేర్లపాక గాంధీ చెప్పినప్పుడే `అడల్ట్` డోస్ ఉన్న సినిమా `ఏక్ మినీ కథ` అనేది అర్థమైపోయింది. ఆ `మినీ` ఏమిటన్నది… ట్రైలర్లలో హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. తన `సైజ్` చిన్నదని భయపడిపోయి, బెంగపడిపోయిన ఓ అబ్బాయి కథ ఇది. చూడ్డానికి వింతగా ఉన్నా, తీయడానికి చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. గీత దాటితే బూతు అయిపోతుంది. గీత అవతల ఉండిపోతే.. మేటర్ అర్థం కాదు. సరిగ్గా గీత మీద నిలబడి చెప్పాల్సిందే. మరి అది జరిగిందా? మినీ కథలో… ఉన్న మెనీ థింగ్స్ ఏమిటి? అమేజాన్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈసినిమాలో `మేటర్` ఏమిటి?
కథలోకి వెళ్తే.. సంతోష్ (సంతోష్ శోభన్) కి చిన్నప్పటి నుంచీ తన `సైజ్` చిన్నదన్న ఫీలింగ్. అందుకే చదువుపై శ్రద్ధ పెట్టలేడు. అత్తెసరు మార్కులతో ఇంజనీరింగ్ పాసై… చిన్న ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఎలాగైనా తన `సైజ్` పెద్దది చేసుకోవాలన్న తపన. అందుకే రకరకాల చిట్కాలు ట్రై చేస్తుంటాడు. ఆఖరికి ఆపరేషన్ ద్వారా సైజు పెంచుకోవాలని చూస్తాడు, ఏదీ సెట్ కాదు. తనకు అమృత (కావ్య థాపర్)తో పెళ్లి కుదురుతుంది. తనవన్నీ `బిగ్` డ్రీమ్సే. జీవితంలో అన్నీ పెద్ద పెద్దవే కావాలంటుంది. అక్కడే..అమృత అంటే.. సంతోష్ భయపడుతుంటాడు. నిజానికి ఈ పెళ్లి శోభన్ కి ఇష్టం ఉండదు. కానీ అమృత ప్రేమలో పడిపోయి… అనుకోని పరిస్థితుల్లో పెళ్లికి కమిట్ అయిపోతాడు. కానీ శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. మరి శోభనం జరిగిందా? లేదా? తన సైజ్ మేటర్ ని ఎలా సెట్ చేశాడు? ఆ కొత్త కాపురంలో అలకలు, అపార్థాలూ, కలహాల గోలేంటి? అనేది ఓటీటీ తెరపై చూడాలి.
నిజానికి చాలా ఇబ్బందికరమైన కథ ఇది. ఓ అబ్బాయి కి సైజ్ చిన్నదన్న ఫీలింగ్ కలగడం, దాన్ని పెంచుకోవడానికి రకరకాలుగా తిప్పలు పడడం, వ్యభిచార గృహానికి వెళ్లి… తన కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలనుకోవడం, డాక్టర్ దగ్గర సైజుల గురించి మాట్లాడడం.. ఇవన్నీ కాస్త కత్తిమీద సాములాంటి దృశ్యాలే. పక్కగా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్. దాన్ని సున్నితమైన వినోదపు పూత పూసి… సరదా సన్నివేశాలతో నడిపించేశాడు దర్శకుడు. కాస్త బోల్డ్ విషయం అని తెలుస్తున్నా.. ఆడవాళ్లు, పిల్లలతో ఈసినిమా చూడ్డానికి ఇబ్బంది పడుతున్నా (వాళ్లతో చూడకపోవడమే బెటర్) సరదాగా సాగిపోతుంది. కథని మొదలెట్టిన తీరు, మెల్లగా అసలు విషయంలోకి లాక్కెళ్లిన విధానం.. ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. `సైజు` గురించి చెబుతూ సాగే తొలి పాట కూడా బాగా డిజైన్ చేశారు. కథ తెలియకుండా ఆ పాట వింటే. పాటలా ఉంటుంది. కథ తెలిస్తే… `సైజు` గురించిన బాధలూ, బెంగలూ అర్థమవుతాయి. ఆ పాటని బాగా రాశారు రచయిత.
డాక్టరు దగ్గరకు వెళ్లి సమస్య చెప్పుకోవడం, వ్యభిచార గృహంలోకి వెళ్లి స్టామినాని చెక్ చేసుకోవడం లాంటి దృశ్యాలు… నవ్వులు పూయిస్తాయి. రిసెప్షన్లో రకరకాల మేనరిజాలు ఉన్న వ్యక్తులు రావడం, వాళ్లతో కామెడీ పండించాలని చూడడం కాస్త విసిగిస్తుంది. అవన్నీ కావాలని ఇరికించిన సన్నివేశాల్లా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో సినిమా అంతా శోభనాన్ని వాయిదా వేయడం అనే పాయింట్ పై సాగుతుంది. సప్తగిరి ని ప్రవేశపెట్టి, కామెడీ పండించినా.. అదే రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సదరు సన్నివేశాలు ఇది వరకు సినిమాల్లో చూసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇలాంటి కథలకు ఎమోషన్ అనే లింక్ చాలా అవసరం. దాన్ని మిళితం చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు కూడా. కానీ… ఈ కథకూ, ఆ ఎమోషన్ లింకు సరిగా కనెక్ట్ అవ్వలేదు. చివర్లో హీరో చేసిన చిలిపి పనులన్నీ బయటపడిపోయి, హీరోయిన్ దూరం అయిపోతుంది. వాళ్లిద్దరినీ మళ్లీ కలిపే ప్రోసెస్ చాలా కృతకంగా ఉంటుంది. కథని ఎలాగోలా ముగించాలి కాబట్టి.. అలా ప్రొసీడ్ అయిపోయారు.
సంతోష్ చాలా ఈజ్‌తో తన పాత్రని చేసుకుంటూ వెళ్లిపోయాడు. నిజానికి ఈ తరహా పాత్రలు చేయడానికి కాస్త ధైర్యం కావాలి. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా సరిపోయాయి. కావ్య థాపర్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో… తనకసలు డైలాగులే ఉండవు. సుదర్శన్ నవ్విస్తాడు. హీరో తరవాత.. కథని నడిపించేది తనే. శోభన్ తండ్రిగా బ్రహ్మాజీ నటన కూడా మెప్పిస్తుంది. శ్రద్ధాదాస్ ని ఓ పాత్ర కోసం తీసుకొచ్చారు గానీ, అంత ఇంపాక్ట్ లేదు.
ముందే అనుకున్నట్టు చాలా సున్నితమైన పాయింట్ ఇది. దర్శకుడు ఒకంత బాగానే డీల్ చేశాడు. కామెడీ వర్కవుట్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ఈ సినిమా కథనీ, అందులోని పాయింట్ ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టమయ్యేది. సంభాషణలు బాగున్నాయి. చిన్న చిన్న మాటల్లోనే సున్నితమైన హాస్యం పండించారు. కరెంట్ ఎఫైర్స్ ని బాగా వాడుకున్నారు. ఉదాహరణకు సోనూసూద్. పాటలు కథలో భాగమైపోయాయి. వాటి కొరియోగ్రఫీ కూడా బాగుంది. చిన్న సినిమా అయినా.. క్వాలిటీ తగ్గలేదు. తొలి సగం నవ్వులతో సరదాగా నడిచిపోతే.. ద్వితీయార్థం కాస్త విసుగనిపిస్తుంది.
మొత్తానికి తెలుగు తెరపై ఎవరూ డీల్ చేయని, చేయడానికి భయపడే `సైజ్` అనే పాయింట్ ని దర్శకుడు కాస్త తెలివిగా డీల్ చేసి, వినోదాన్ని నమ్ముకుని దాటేశాడు. థియేటర్ సంగతేమో గానీ.. ఇది పక్కా ఓటీటీ సినిమా. సరదాగా కాలక్షేపం కోసం చూసేయొచ్చు. వీలైనంత వరకూ ఒంటరిగా చూడడమే బెటర్.
ఫినిషింగ్ టచ్: కింగ్ `సైజ్` వినోదం