రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కింది కోర్టులో బెయిల్ బాండ్లు సమర్పించి బెయిల్ తీసుకోవాలని ఆదేశించింది. అయితే బెయిల్ ప్రక్రియ అధికారికంగా పూర్తి కాక ముందే రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రి నుంచి వెళ్ళిపోయారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఎయిమ్స్‌లో ప్రాథమిక చికిత్స చేయించుకుని ఇంటికెళ్లిపోయారు. బెయిల్ బాండ్లు సమర్పించకుండా ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి ఎలా వెళ్లిపోతారని ఇప్పుడు వైసీపీ తరపు లాయర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా…జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆయన ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పది రోజులలో బెయిల్ కు సంబంధించిన బాండ్లను గుంటూరు సీఐడీ కోర్టులో సమర్పించవచ్చని చెప్పిందని రఘురామ తరపు న్యాయవాదులు అంటున్నారు. డిశ్చార్జ్ అయితేనే డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారని.. అందుకే ఆయనడిశ్చార్జ్ అయ్యారని ఇప్పుడు సమ్మరీని.. బాండ్లను కోర్టుకు సమర్పిస్తామని అంటున్నారు.
రఘురామరాజు తరపు న్యాయవాదులు ఆయనకు ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన డిశ్చార్జి సమ్మరీ తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో షూరిటీ బాండ్లతో కలిపి దాఖలు చేయనున్నారు. అనంతరం ఆయన విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించనున్నారు. ఈ సందర్భంగా సీఐడీ కోర్టు ఎలా స్పందిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. రఘురామరాజు కోర్టును సైతం ధిక్కరించి కస్టడీ నుంచి వెళ్లిపోయారని ప్రభుత్వం వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు.. ఈ కేసు కీలక మలుపులు తిరుగుతుందని అంచనా వేస్తున్నారు.