పోలవరం ప్రాజెక్ట్ ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకు కామధేనువులా మారినట్లుగా కనిపిస్తోంది. అధికారం చేపట్టగానే రివర్స్ టెండర్ల పేరుతో రూ. నాలుగైదు వందల కోట్లు మిగిలిస్తున్నామని అప్పటి కాంట్రాక్ట్ కంపెనీని తొలగించేసి… మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. ఏడాదిన్నర కాక ముందే… రివర్స్ టెండరింగ్‌లో మిగిలించిన రూ. నాలుగైదు వందల కోట్లకు అదనంగా.. మరో వెయ్యి కోట్ల అంచనాలు పెంచేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసేశారు. అడ్డగోలు దోపిడీ ఎలా చేయాలో పక్కాఉదాహరణలా ఉన్న ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. తాజాగా మరోసారి కొత్త పనుల కోసం పిలిచిన టెండర్లలోనూ మేఘా కంపెనీ రివర్స్ టెండర్లేసింది. రెండు శాతం తక్కువకు చేస్తామని చెప్పి పనులు దక్కించుకుంది.
పోలవరం ప్రాజెక్టులో కొత్తగా రూ. 693 కోట్ల విలువైన పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కొన్ని ప్రాజెక్టు పనులతోపాటు మరో ఎత్తిపోతల ప్రాజెక్ట్ కూడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీని వాడుకునేందుకు.. ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. దీని కోసం టెండర్లను పిలిచారు. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. మేఘా కాకుండా ఓ కంపెనీ… 0.9 శాతం తక్కువకు పనులు చేసేందుకు టెండర్లు వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రివర్స్ టెండర్లకు వెళ్లారు. అందులో మేఘా కంపెనీ రెండు శాతం తక్కువకు చేసేందుకు అంగీకరించింది. దీంతో మేఘాకే ఆ పనులు కట్ట బెట్టేందుకు నిర్ణయించారు.
ఇదంతా పక్కాగా.. మేఘా కంపెనీకు ఇచ్చేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియగా అనుమానిస్తున్నారు. ఓ సారి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి పనులు చేయలేక.. అసలు కన్నా.. కొన్ని వేల కోట్లను ఎక్కువగా డిమాండ్ చేస్తున్న సంస్థ .. ఇప్పుడు మళ్లీ కొత్త పనుల్ని రెండు శాతం తక్కువకు చేస్తామంటే .. ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుందన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. వాస్తవానికి ఆ సంస్థకు టెండర్ నిబంధనల ప్రకారం.. జరిమానా విధించాలి. కానీ కొత్త కాంట్రాక్టులను బహుమతిగా ఇస్తున్నారు. ఇప్పుడు రెండు శాతం తక్కువకు కోట్ చేసి… తర్వాత పది శాతం ఎక్కువ చెల్లించేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకున్నా… ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. పోలవరం ప్రధాన టెండర్లలో జరిగింది అదే. అచ్చంగా ప్రజాధనాన్ని దోపిడీ చేయడమే.