రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక మరణించిన వారి సంఖ్య 23 అని ప్రభుత్వం గుర్తించింది. నిన్నటి వరకూ పదకొండు మందే అని వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 23మందిగా గుర్తిస్తూ.. వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన రూ.23 లక్షల పరిహారం రిలీజ్ చేశారు. మిగిలిన పన్నెండు మందిలో ఆరు కుటుంబాలకు ఇప్పటికే పరిహారం పంపిణీ చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి హైడ్రామా నడిచింది. ఆస్పత్రిలోని దృశ్యాలు కూడా బయటకు రావడంతో సంచలనం సృష్టించింది. కనీసం పాతిక మంది చనిపోయారని విపక్షాలు ఆరోపించాయి. కలెక్టర్ మాత్రం పదకొండు మందేనని చెప్పారు. ప్రభుత్వం కూడా అదే చెప్పింది.
అయితే విపక్ష పార్టీలు.. మిగతా సమాచారాన్ని అంతా సేకరించాయి. రుయాలో ముఫ్పై మందికిపైగా.. ఆ రోజు ఆక్సిజన్ అందక మరణించారని పేర్లతో సహా వెల్లడించాయి. కొన్ని విపక్ష పార్టీల నేతలు.. నేరుగా గవర్నర్కు.. జాతీయ మానవహక్కుల సంస్థకూ ఫిర్యాదు చేశారు. కొంత మంది హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. జాతీయ మానవహక్కుల సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. ఇంత వరకూ బాధ్యులెవరో గుర్తించలేదని… చనిపోయిన వారి సంఖ్యను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారని… పిటిషనర్లు ఆరోపించారు. ఇది తీవ్రమైన నేరం గా పరిగణిస్తారు కాబట్టి… సమస్యను వీలైనంత తక్కువ చేయడానికి ప్రభుత్వం కొత్తగా మరో పన్నెండు మంది ఆక్సిజన్ అందక మరణించినట్లుగా గుర్తించిందని భావిస్తున్నారు.
రుయాలో ఆక్సిజన్ ట్రాజెడీకి కారణం ఎవరో ఇప్పటి వరకూ గుర్తించలేదు. కోవిడ్ సెంటర్ ఉన్న హోటల్లో అగ్నిప్రమాదం జరిగితే … హోటల్ యాజమాన్యాన్ని కాకుండా..కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేసిన ప్రభుత్వం.. మానవ తప్పిదం కారణంగా ఇరవై మూడు మంది చనిపోయినా బాధ్యులెవరో గుర్తించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరణాల్ని కూడా తక్కువ చేసి చూపించింది. ఇప్పుడు… ఇరవై మూడు మందినిఅధికారికంగా గుర్తించింది. ఇవన్నీ… హైకోర్టు.. ఎన్హెచ్ఆర్సీ విచారణల్లో కీలకమయ్యే అవకాశం ఉంది.