ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పటికీ.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు.. ఆధారాలు లేకుండానే ఎన్ఫోర్స్మెంట్ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడిన వేం నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్కి రేవంత్ రెడ్డి రూ. యాభై లక్షలు ఇస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారులు పక్కాగా ట్రాప్ చేసి.. స్టీఫెన్సన్ ఇంట్లో ప్రతి మూలలోనూ కెమెరాలు పెట్టి డబ్బులు ఇస్తూండగా పట్టుకున్నారు. ఆ కేసులో చంద్రబాబు కూడా ఉన్నారని.. ఆయన .. ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడారని.. ఓ ఆడియో టేప్‌ను కొన్ని మీడియాల్లో ప్రసారం అయింది.
అది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబుల్లో నిర్ధారించారు. అయితే ఆ ఆడియోలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు … హామీలు నెరవేరుస్తామని… నిర్భయంగా నిర్ణయం తీసుకోండని సూచించారు. ఓటు అడిగినట్లుగానే ఉందని న్యాయనిపుణులు తేల్చారు. అయితే.. రాజకీయంగా హై ప్రోఫైల్ కేసు కావడంతో… ఆయనను కూడా నిందితునిగా చేరుస్తారన్న ప్రచారం ఉద్దృతంగా సాగింది. కొద్ది రోజుల కిందట.. ఈడీ విచారణ జరుపుతున్నప్పుడు… మత్తయ్యను విచారణకు పిలిచారు. ఆ సమయంలో ఈడీ వర్గాల పేరుతో మీడియాలో చంద్రబాబు పేరు చెప్పారని విస్తృత ప్రచారం కూడా చేశారు.
అయితే అవన్నీ ఫేక్ న్యూస్ అని తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌తో తేలిపోయింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా అటు ఈడీ కానీ.. ఇటు ఏసీబీ కానీ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేదు. మొదటగా ఏసీబీ కేసుపై చార్జిషీట్ దాఖలు చేసింది. తర్వాత యాభై లక్షల లావాదేవీ కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగం నమోదు చేసింది. దీనిపైనే ఈసీబీ చార్జిషీట్ ఆధారంగానే… ఈడీ కూడా చార్జిషీట్ నమోదు చేసింది. ఏసీబీ చార్జిషీట్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున.. ఈడీ కూడా.. ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయింది.