తప్పుడు ట్వీట్లు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది ట్విట్టర్ సంస్థ. కానీ ఇండియాలో తప్పుడు ట్వీట్లు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలకు మ్యానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ తగలిస్తున్నందుకు.. ట్విట్టర్‌నే బ్యాన్ చేయాలని డిసైడవుతున్నారు ఇండియా పాలకులు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏది..? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్. కానీ.. మెల్లగా నియంతృత్వ దిశగా వెళ్తోందనడానికి సాక్ష్యాలుగా కొన్నాళ్లుగా అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో తాజా ఉదాహరణ.. ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతను హరించే ప్రయత్నం.
వ్యక్తిగత సమాచార గోప్యత వద్దే వద్దంటున్న కేంద్రం..!
అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం… అధికార పార్టీలకు మద్దతుగా ఉండేవారికి మాత్రమే కాదు.. వ్యతిరేకించే వారికీ ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థల నుంచి గోప్యత లేకుండా… ఎవరి సమాచారం అయినా సులువుగా తీసుకునేలా కొత్త నిబంధనలు రూపొందించింది. దాని ప్రకారం.. సోషల్ మీడియా సంస్థలన్నీ… వినియోగదారులు .. చాసే చాట్స్ దగ్గర్నుంచి ప్రతి ఫైల్‌ను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలి. ఏ మాత్రం గోప్యత లేకపోతే… సాధారణ పౌరులు భయపడి, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించడానికి భయపడతారు. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలకు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ విడియో వంటి ఓటీటీ వేదికలకు వర్తించేలా కేంద్రం అమల్లోకి తెచ్చిన నిబంధనలు ఇప్పుడు అనేక చర్చలకు .. వివాదాలకు కారణం అవుతున్నాయి.
ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంనదలు… సోషల్ మీడియాలో వినియోగదారులకు ఉండే ప్రత్యేకమైన ప్రివిలేజెస్ లేకుండా పోతాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.ఈ నిబంధనలు ఆయా సోషల్ మీడియా చెప్పుకునే విలువలకు, వ్యాపారానికి మాత్రమే కాక, వాటిని వినియోగించే అసంఖ్యాక ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరం. అందుకే.. భావ ప్రకటనాస్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు భంగకరం అన్న ప్రాతిపదిక మీద వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం మరింత అసహనానికి లోనవుతోంది. భావ ప్రకటనా స్వేచ్చను, గోప్యతను కాపాడాల్సింది ప్రైవేటు సంస్థలు కాదని.. వ్యవస్థలని చెప్పుకొస్తోంది. నిజానికి ఇండియాలో వ్యవస్థలని తమ రాజకీయ అవసరాల కోసం.. పాలకులు ఎంతగా నాశనం చేశారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నిజాయితీగా ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికల సంఘం నుంచి… సీబీఐ వరకూ ఏ వ్యవస్థా సరిగ్గా పని చేయడం లేదు. అన్నీ…బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి.
రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని సంగ్రహించడమే అసలు లక్ష్యం..!
వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో వినియోగదారుల మధ్య సంభాషణలు, సమాచార వినిమయం జరుగుతూ ఉంటుంది. ఆ వాటిని నిర్వహించే వారికి ఆ సంభాషణలలోని, సమాచారంలోని అంశాలతో ఎటువంటి ప్రమేయం ఉండదు. అందుకే అవి తటస్థ వేదికలు. ఏదైనా అభ్యంతరకర అంశాలుంటే, ఆ అంశాలను పంపినవారు బాధ్యులవుతారు తప్ప యాప్స్ కాదు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన నిబంధనలను కనుక వాట్సాప్ వంటి సంస్థలు పాటించకపోతే వారినే నిందితులుగా మారుస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వాట్సాప్ చెప్పుకునే ఘనత. అంటే, పంపినవారు, తీసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ సందేశాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం లేని సాంకేతిక రక్షణ. వచ్చిన నిబంధనలు ఏమి అడుగుతున్నాయంటే, ఏదైనా వ్యాప్తి చెందిన ఒక సందేశం మొదటగా ఎక్కడ నుంచి మొదలైంది అధికారులతో వాట్సాప్ వంటి వేదికలు పంచుకోవాలి. అట్లా పంచుకోవడం అంటే, ఆసాంతం గోప్యత అన్న విలువను పక్కన పెట్టవలసిందేనని, ఇక వినియోగదారులకు స్వేచ్ఛ ఎక్కడుంటుందని ఆ వేదికలు ప్రశ్నిస్తున్నాయి. అట్లాగే, ప్రభుత్వం అభ్యంతరకరమని సూచించిన ఏ పోస్టునైనా 36 గంటలలోగా తొలగించాలి. మాధ్యమ సంస్థలుగా తమకు కొన్ని మార్గదర్శకాలు, విధానాలు ఉంటాయని, మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా కేవలం ఆదేశాలకు లోబడి సందేశాలను తొలగిస్తే, ఇక భావస్వేచ్ఛకు అర్థమేమిటని ట్విట్టర్ ప్రశ్నిస్తోంది.
వాట్సాప్ యూనివర్శిటీ సృష్టికర్త బీజేపీనే..!
అసలు ఫేక్ న్యూస్ సృష్టికర్త..బీజేపీ సోషల్ మీడియా అని.. దేశంలోఅందరికీ ఓ అభిప్రాయం ఉంది. కొన్ని లక్షల మందితో బీజేపీ సోషల్ మీడియా టీంను నిర్వహిస్తూ.. విపరీతంగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఫార్వార్డ్ చేస్తూ ఉంటుంది. వాట్సాప్ యూనివర్శిటీ అని బీజేపీ కార్యకర్తలకు ఓ పేరు కూడా ఉంది. వారు అధికారంలో ఉన్నారు కాబట్టి.. వారి ఫేక్ న్యూస్‌పై ఎలాంటి చర్యలు తీసుకునేవారు లేరు. ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయగలరు. కానీ.. అలా చేయడాన్ని తప్పు అని చెబుతున్న సంస్థలే ఇప్పుడు.. తప్పుడువిగా మారుతున్నాయి. ప్రస్తుత వివాదం కూడా.. ఓ ఫేక్ టూల్‌కిట్ అంశంతో ప్రారంభమయింది. కొవిడ్ నియంత్రలమనరేంద్రమోదీ విఫలమయ్యారని ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక టూల్ కిట్ రూపొందించిందని బిజెపి నేతలు ఓ లెటర్ ప్యాడ్‌ను ట్విట్టర్లో పెట్టి కాంగ్రెస్‌పై ఆరోపణలు ప్రారంభించారు. అది ఫేక్ అని ట్విట్టర్ భావించి… మ్యానిపులేటెడ్ మీడియా అని పోస్టులకు పెట్టింది. ఇది.. బీజేపీ పెద్దలకు నచ్చలేదు. ప్రభుత్వం మీద క్రమంగా ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని అణచివేయడానికి, టూల్ కిట్ కుట్రకేసు వంటిదేదో రూపొందుతోందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
సోషల్ మీడియా లేకుండా బీజేపీ ఉండగలదా…?
భారతీయ జనతా పార్టీ పరిణామ క్రమం చూస్తే… ఆ పార్టీ బలం అంతా సోషల్ మీడియానే. నరేంద్రమోడీని ఓ బాహుబలిలో ప్రజెంట్ చేసి.. సోషల్ మీడియాతో ఆయన ఇమేజ్ను పెంచుకుంది. అర్థం పర్థం లేని ఎలివేషన్లు ఇచ్చి… అవసరం లేని దేశభక్తితో సోషల్ మీడియాను నింపేసింది. ఇప్పుడు… తమ రాజకీయ అవసరాలకు.. ఆ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని వాటిపైనే తెగబడుతోంది. సోషల్ మీడియా సంస్థల తీరును సమర్థించలేం కానీ..ప్రభుత్వ దురుద్దేశాన్ని మాత్రం… తోసిపుచ్చలేం…!