భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. గత ఎన్నికల్లో పాకిస్తాన్ను బూచిగా చూపించినా… ఈ సారి మాత్రం చైనాను చూపించబోతోంది. దానికి సంబంధించి..ఇప్పటికే ఆ పార్టీ నతలు ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రకటనలు ప్రారంభించారు. బెంగాల్లో బీజేపీని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించిన నేతల్లో ఒకరైన కైలాష్ విజయవర్గీయ.. అనే నేత దీన్ని ప్రారంభించారు. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడానికి చైనా కుట్ర పన్నిందని.. ఆ కుట్రను భారతీయులందరూ చేధించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రకటించేశారు.
రెండో దశ కరోనా సైతం చైనా సృష్టించిన పన్నాగమేనని అందువల్లే ఆసియాలోని దేశాలన్నింటిలో భారత్ మాత్రమే ఇబ్బంది పడుతోందని, మరెక్కడా ఇంత తీవ్రత లేదని చెప్పుకొచ్చారు. కైలాస్ విజయవర్గీయ ప్రారంభించారు. రేపు మోడీ వరకూ సందర్భాన్ని బట్టి అందరూ చైనాపై విరుచుకుపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఆ దేశంలో దుమ్మెత్తి పోసి..,ప్రజల్లో జాతీయ భావాన్ని ఎన్నికల సమయానికల్లా పీకల వరకూ తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రియమిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కూడా.. అదే వ్యూహం అమలు చేశారు.
చీటికిమాటికి చైనాను నిందించి… బూచిగా చూపి.. ఎన్నికలకు వెళ్లారు. అయితే చివరికి ట్రంప్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ..మోడీ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. అయితే ఇండియన్స్ అమెరికన్లు కాదు కాబట్టి.. ఇక్కడ సోషల్ మీడియాను వాడే విధానం వేరు కాబట్టి… ఫలితాలను ఇప్పుడే అంచనా వేయడం కష్టం.