విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యాశాఖ చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటోంది. టెన్త్ పరీక్షల నిర్వహణ అసాధ్యమని ముందుగానే గుర్తించారు. వారికి ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు కూడా కేటాయించారు. దీంతో.. ఓ పెద్ద టాస్క్ పూర్తయినట్లయింది. ఇప్పుడు… ఇంటర్ క్లాసుల్ని… రెగ్యులర్ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలాగానే ప్రారంభిస్తున్నారు. జూన్‌లో.. ఆన్ లైన్ క్లాసుల్ని ప్రారంభించాలని నిర్ణయించారు. జూనియర్ ఇంటర్ పరీక్షల్ని కూడా రద్దు చేశారు. సీనియర్ ఇంటర్ పరీక్షల్ని మాత్రం కాస్త ఆలస్యమైనా నిర్వహిచాలని అనుకుంటున్నారు.
ఎందుకంటే… విద్యార్థుల భవిష్యత్ కోసం..ఈ పరీక్షలు చాలా ముఖ్యం. వివిధ ప్రవేశ పరీక్షల్లో… అడ్మిషన్ల విషయంలో ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు వెయిటేజీ ఉంటుంది. జూన్ చివరి కల్లా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతుందన్న అభిప్రాయం ఉండటంతో… జూలైలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కడా వివాదాస్పదం కాకుండా.. ఈ వ్యవహారాలన్నింటినీ ప్రభుత్వం స్మూత్‌గా చేసుకెళ్తోంది. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చేస్తోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో టెన్త్ పరీక్షలను రద్దు చేయలేదు.
వచ్చే నెల విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా టెన్త్ విద్యార్థులు… జూలైలో పరీక్షలకు రెడీ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ టెన్త్ విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో విద్యాశాఖ చాలా బాగా పని చేస్తుందన్న అభిప్రాయాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ విద్యా సంవత్సరం..మొత్తం గందరగోళంగా మారింది. కనీసం వచ్చే విద్యాసంవత్సరాన్ని అయినా కాస్త ప్లానింగ్ ప్రకార నిర్వహించుకుంటే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.