తీర్పుల్లో మీ ఇష్టం వచ్చినంత వరకూ అన్వయించుకుని … మిగిలిన దాన్ని పట్టించుకోరా..!? . .. అని సీఐడీపై ఏపీ హైకోర్టు తీవ్రంగా విమర్శించి… రోజులు కూడా కాలేదు. అప్పుడే సీఐడీ సుప్రీంకోర్టు తీర్పునకే వక్రభాష్యం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించారన్నదానిపై ప్రస్తుతం అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్మీ ఆస్పత్రిలో చేయించిన పరీక్షల్లో ఆయన కాళ్లకు గాయాలయ్యాయని తేలింది.దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ వేలు ఫ్రాక్టర్ అయింది. ఎయిమ్స్‌లో కూడా ఆయన కాళ్లకు పరీక్షలు నిర్వహించి… రెండు వారాల పాటు నడవకుండా… మందులు వాడాలని వైద్యులు సూచించారు.
ఇప్పుడు సీఐడీ కొత్తగా తన వాదన వినిపించడం ప్రారంభించింది. అదేమిటంటే.. రఘురామకృష్ణరాజు కాళ్లకు గాయాలున్నాయని ఆర్మీ ఆస్పత్రి నివేదికలో చెప్పలేదనే వాదన వినిపించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నాలుగైదు రోజుల తర్వాత.. పూర్తిగా అధ్యయనం చేయడానికి సమయం తీసుకున్నారేమో కానీ… గాయాలున్నాయని కానీ.. అవి కస్టడీలోనే అయ్యాయని కానీ… ఆర్మీ ఆస్పత్రి చెప్పలేదనే కొత్త వాదనతో మీడియాకు ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఆర్మీ ఆస్పత్రి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు ఇరుపక్షాల లాయర్లకు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఫోటోలు.. ఎక్స్‌రేలతో సహా… రఘురామకృష్ణరాజు కాళ్లకు అయిన గాయాల గురించి ఉంది.
రఘురామకృష్ణరాజును హింసించిన అంశంపై… సీబీఐ విచారణ కోసం…పిటిషన్ విచారణలో ఉంది. సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు… సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ ఖాయమన్న ప్రచారం జరుగుతూండటంతో సీఐడీ అధికారులు కంగారు పడినట్లుగా ఉన్నారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో కొట్టినట్లుగా లేదని వాదించడం ప్రారంభించారు. గుంటూరు ఆస్పత్రి నివేదికను సీఐడీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అది ఫేక్ రిపోర్ట్ అని… ఆంధ్రజ్యోతి అదే పనిగా కథనాలు రాస్తోంది. కావాలంటే కేసు పెట్టుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఐడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తోంది.