థ్రిల్లర్ సినిమా అనగానే మలయాళం నుంచే రావాలి.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అక్కడ తయారవుతున్న థ్రిల్లర్లు ఏ భాషలోనూ తెరకెక్కడం లేదంటే నమ్మి తీరాల్సిందే. అక్కడి సినిమాల్ని రీమేక్స్ చేసుకోవడానికి యావత్ భారతదేశం రెడీగా ఉంది. తెలుగులో వస్తున్న థ్రిల్లర్స్ లో దాదాపు సగం.. మలయాళం రీమేకులే. రెండేళ్ల క్రితం `అతిరన్` అనే సినిమా విడుదలైందక్కడ. ఇప్పుడు `అనుకోని అతిథి` పేరుతో అనువదించారు. `ఆహా`లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి…. థ్రిల్లర్స్‌కి కొత్త అర్థం చెప్పిన మలయాళంలో.. `అనుకోని అతిథి`కి చోటెక్కడ? ఇందులో థ్రిల్ ఎంత? డ్రామా ఎంత?
మారుమూల ప్రాంతం. దట్టమైన అడవి. దాని మధ్యలో ఓ పిచ్చాసుపత్రి. అందులో ఉండేది ఐదారుగురు పేషెంట్లే. కానీ ఆ పిచ్చాసుపత్రిలో ఏదో జరగరానిది జరుగిందన్నది అందరిలోనూ అనుమానం. అదేంటో కనిపెట్టి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వడానికి సైక్రాటిస్ట్ నందా (ఫాజిల్) అక్కడికి వెళ్తాడు. ఆసుపత్రిలో తనకు రకరకాలైన అనుభవాలు ఎదురవుతాయి. విచిత్రమైన వ్యక్తులు పరిచయం అవుతారు. ఓ గదిలో.. నిత్య (సాయి పల్లవి) అనే పేషెంట్ ని బంధీగా ఉంచుతారు. ఆమెకు సంబంధించిన గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నందా. తనని ఆ పిచ్చాసుపత్రి నుంచి బయటకు తీసుకురావాలనుకుంటాడు. ఈలోగా.. నందాపై హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఇంతకీ ఆ పిచ్చాసుపత్రిలో ఏం జరుగుతోంది. నిత్య వెనుక ఉన్న గతమేంటి? నందాని చంపాలనుకుంటున్నవాళ్లు ఎవరు? అనేది మిగిలిన కథ.
అన్ని థ్రిల్లర్ సినిమాల్లానే… `అనుకోని అతిథి` కూడా ఇంట్రస్టింగ్ నోట్ తో మొదలవుతుంది. 1970… ఆ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ బంగ్లాలోని వ్యక్తులంతా హత్యకు గురవుతారు. దానికి కారణం నిత్య అనుకుని. ఆమెని పిచ్చాసుపత్రికి తరలిస్తారు. అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకోవడానికి నందా అనే పాత్ర అక్కడికి ప్రవేశిస్తుంది. ఆసుపత్రిలోని వ్యక్తులు, అక్కడ నందాకి ఎదురవుతున్న అనుభవాలు ఇవన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ ఆసుపత్రి వెనుక రహస్యాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రేక్షకులకు కలుగుతుంటుంది. అయితే… ఆ రహస్యాన్ని క్లైమాక్స్ వరకూ దాచేశాడు దర్శకుడు. చివరి పది నిమిషాలే కథకు ఆయువు పట్టు. అక్కడే ట్విస్టులన్నీ రివీల్ అవుతుంటాయి. అవి చూస్తే… కాస్త షాకింగ్ గానే అనిపిస్తాయి. `షటర్ ఐలాండ్` లాంటి హాలీవుడ్ సినిమాకి ఆయా సన్నివేశాలు స్ఫూర్తిగా అనిపిస్తాయి. నిజానికి `షటర్ ఐలాండ్` లాంటి సినిమాలు చూసినవాళ్లు ఆ ట్విస్ట్ ని ముందుగానే ఊహిస్తారు. అయితే ఆ పది నిమిషాల ట్విస్ట్ కోసం సినిమా అంతా భరించడం కొంచెం కష్టమే. సినిమా అంతా ఒకట్రెండు లొకేషన్ల మధ్యే సాగుతుంది. ఆ ఆడవి.. అందులోని విలాసవంతమైన భవంతి.. కొత్త అనుభూతి కలిగిస్తాయి. కలరి కళ నేపథ్యంలో సాగే సన్నివేశాలు.. వాటిని చిత్రీకరించిన విధానం బాగున్నాయి. క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా అనిపించినా.. చాలా ప్రశ్నలు వదిలేసినట్టే. పతాక సన్నివేశాల్ని చూస్తే దర్శకుడు పార్ట్ 2కి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుంది. బహుశా… ఈ ప్రశ్నలకుసమాధానం పార్ట్ 2లో చూపిస్తాడేమో..?
ఫాజిల్, నిత్యమీనన్, అతుల్ కులకర్ణి.. ముగ్గురూ మహా నటులే. వాళ్ల నటనా పటిమతో సన్నివేశాల్ని బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పటి వరకూ కనిపించిన ఫాజిల్.. ఈ సినిమాలో కనిపించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంటుంది. తరుణ్ తో ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. తన డబ్బింగ్ సూటైనా..తెలుగు ప్రేక్షకులకు బాగా అలవాటైన గొంతు కాబట్టి.. ఫాజిల్ ని చూసినప్పుడల్లా తరుణ్ గుర్తొస్తాడు. సాయి పల్లవి.. ఒక్కమాటలో అదరగొట్టేసింది. తనకు ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. `నాన్న.. నాన్న` అంటుందంతే. తన హావభావాలతో.. మెప్పించింది. కలరి నేపథ్యంలో సాగే సన్నివేశాల కోసం తను చాలా కష్టపడినట్టుంది. అందుకే అవన్నీ సహజంగా వచ్చాయి. అతుల్ కులకర్ణి స్టైలిష్ గా కనిపించాడు. ప్రకాష్ రాజ్‌ది అతిథి పాత్ర అనుకోవాలి.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా లొకేషన్ నచ్చుతుంది. థ్రిల్లర్ కి ఉండాల్సిన సరంజామా ఇందులో ఉంది. కానీ.. ఆ థ్రిల్ చివరి పది నిమిషాలకే సరిపెట్టారు. అప్పటి వరకూ.. సినిమా నత్తనడక నడుస్తుంది. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి.
మలయాళం నుంచి ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ ని దృష్టిలో ఉంచుకుని, ఫాజిల్ – సాయిపల్లవి ఉన్నారని… ఏవోవో ఊహించుకుంటే, కచ్చితంగా ఇబ్బంది పడతారు. టైమ్ పాస్ కోసం చూస్తే ఓసారి చూసేయొచ్చు. థ్రిల్లర్ ప్రియులకు ఓకే అనిపించే సినిమా ఇది.