భారతదేశంలో కరోనా సృష్టించిన విలయం… విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. చాలా కుటుంబాల్లో తల్లీతండ్రులు ఇద్దరూ కన్నుమూసిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ఒకటి రెండు కాదు కాబట్టి… న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కరోనా కారణంగా అనాథలైన పిల్లలను ఎలా ఆదుకుంటున్నారో చెప్పాలని.. ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంటాయి. చాలా ప్రభుత్వాలు వారికి అన్ని విధాలుగాఅండగా ఉంటామని.. నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. ప్రకటనలు చేశాయి. కానీ అసలు పిల్లలను ఎలా గుర్తిస్తారన్నదానిపై ఎవరికీ అవగాన లేదు. ఎక్కువ మంది లెక్కలోకి రాని పిల్లలే ఉండే అవకాశం కనిపిస్తోంది.
కరోనా మరణాలను ప్రభుత్వాలు.. చాలా తక్కువగా చూపించాయన్నది.. అందరూ నమ్మే నిజం. కరోనా సోకి మరణించినా.. ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారనో… లేకపోతే మరో దీర్ఘ కాలిక రోగం వల్ల చనిపోయారనో నమోదు చేసిన మరణాలే పెద్ద ఎత్తున ఉన్నాయి. వారందర్నీ కోవిడ్ మరణాలుగా గుర్తించే పరిస్థితి లేదు. కోవిడ్ వల్ల చనిపోయిన వారి పిల్లలనే గుర్తించాలనేది ప్రాథమిక నివేదిక. ఈ కారణంగా అనేక మంది పిల్లలకు.. ప్రభుత్వ పరంగా… సాయం కానీ.. వారి ఆలనాపాలననను ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. ఇక్కడే ప్రధానమైన సమస్య ఉంది. ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. పెద్దవాళ్లెవరూ అండగా లేనిపిల్లలు ప్రభుత్వ సాయం కోసం ఎలా ప్రయత్నిస్తారన్నది ఇక్కడ కీలకం. కొంత మంది బంధువులు ఉన్నప్పటికీ.. వారెంత మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఆ పిల్లల భవిష్యత్ కోసం ప్రయత్నిస్తారన్నది కూడా అంచనా వేయాల్సిన విషయమే.
నేటి బాలలే రేపటి పౌరులు. వారే దేశభవిష్యత్. వారిని కాపాడుకుంటేనేదేశం బాగు పడుతుంది. కరోనాతో ఉన్న వాళ్లు ఉన్నారు… పోయిన వాళ్లు పోయారని ప్రభుత్వాలు లైట్ తీసుకుని.. తమకు అధికారం ఉంది కదా.. అని సంతోషపడితే.. అంత కంటే దేశద్రోహం ఉండదు. భావి పౌరుల భవిష్యత్‌ను కాపాడాల్సినవి ప్రభుత్వాలే. దీని కోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. అలాగే పది లక్షలు ప్రకటించేసి.. చేతులు దులుపుకోవడం… వారికి కూడా… తెల్ల రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం లాంటి పిచ్చి పనులు చేస్తే… పాపం చేసినట్లే. ఈ విషయంలోనైనా ప్రభుత్వాలు కనీస మానవత్వం చూపిస్తాయని ప్రజలు భావిస్తున్నారు.