కరోనా తగ్గిపోయే మందు ఇస్తున్నారని అందరి నమ్మకాన్ని చూరగొన్న ఆనందయ్య.. చాలా రోజుల పాటు ఉచితంగా మందు ఇవ్వగలిగారు కానీ.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన తర్వాత ఇవ్వలేకపోతున్నారు. ఆయుర్వేదం పేరుతో నాటు మందులు అమ్ముకునేవాళ్లంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆనందయ్య మాత్రం.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి ఆయన… వైసీపీ నేతల వద్ద బందీగా ఉన్నారు. ఆయనపై ముందుగా రెండు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాతపోలీస్ బందోబస్తుతో తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. కానీ ఆనందయ్య రాడేమో అన్న ఉద్దేశంతో ఆ కేసులు నమోదు చేసి తీసుకెళ్లారు. అప్పట్నుంచి వారం రోజుల పాటు వైసీపీ నేతల అధీనంలో ఉన్నారు.
తర్వాత ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆయుర్వేద మందు ఫార్ములా చెప్పమని వేధిస్తున్నారంటూ.. ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఫలితమో.. వైసీపీ నేతలు కావాల్సినంత మందు చేయించుకున్నారో కానీ… చివరికి వదిలి పెట్టారు. దీంతో నెల్లూరు నుంచి ఆయన కృష్ణపట్నం చేరుకున్నారు. గ్రామస్తులు వచ్చి ఆయనను పలకరించారు. ఆయన కృష్ణపట్నం రాగానే… మరోవైపు సోషల్ మీడియాలో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో ఆయన కంగారు పడి… ఎవరూ రావొద్దని..ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతనే మందు పంపిణీ చేస్తానని ప్రకటించాల్సి వచ్చింది. వెంటనే మళ్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనను నిర్బంధంలోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు.
ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి … చెబుతున్నారని… పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో కృష్ణపట్నం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆందోళనతో ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఆయనేదో తప్పు చేసినట్లుగా… అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే మీడియా చానళ్లలో ప్రసారం చేయడం కూడా… కుట్రపూరితంగా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందు వల్ల కొంత మంది చనిపోయారంటూ… ప్రముఖ టీవీ చానల్‌లో బ్రేకింగ్‌లు వచ్చాయి. ఇవన్నీ ఆయనను బెదిరించడానికి ఆడుతున్న నాటకంగా చెబుతున్నారు.
మొత్తానికి ఆనందయ్యకు ప్రశాంతత లేకుండా పోయింది. సొంత ఖర్చుతో ఇంత వరకూ మందు తయారు చేసి పంపిణీ చేశారు. ఇప్పుడు.. ఆయన కొంత మందికి వ్యాపార వస్తువు అయిపోయినట్లుగా కనిపిస్తోంది. మరో వైపు మందు కోసం ప్రజలు ఎదురు చూస్తూంటే.. ప్రభుత్వం మాత్రం.. ఆయనతోనే గేమ్ ఆడుతోంది. అదుపులోనే ఉంచుకుంటోంది.