ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పరిపాలన చేస్తూంటే.. చిత్తూరు జిల్లాలను పెద్దిరెడ్డి తను కనుసన్నల్లో ఉండేలా పరిపాలిస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా విధానపరమైన నిర్ణయాలను అమలు చేసేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా చిత్తూరు జిల్లాలోకి అడుగు పెట్టాలంటే.. కోవిడ్ నెగెటివ్ రిపోర్టు తీసుకు రావాల్సిందేనని… మంత్రి పెద్డి రెడ్డి హుకూం జారీ చేశారు. నిజానికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అయితే… మంత్రుల ఆదేశాలు సహజమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంతర్రాష్ట్ర సరిహద్దులు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తేనే వాటికి వాలిడిటీ ఉంటుంది.
ఏపీ వాసుల్ని… ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే రానిస్తామని గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఎవరో ఓ మంత్రి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా..అధికారికంగాఆంక్షలు విధించాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. లాక్ డౌన్ సమయం నిబంధనలు మినహా.. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే ఎవరినైనా ఏపీలోకి రానిస్తామన్న నిబంధనలు పెట్టలేదు. కానీ పెద్దిరెడ్డి మాత్రం తాను చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రిని కాబట్టి.. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రకటించేశారు.
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని… కంట్రోల్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రానివ్వడమే మేలని ఆయన నిర్ణయించేసుకుని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మంత్రులు… కాస్త పలుకుబడి ఉన్న వారందరూ.. ఇలా ప్రాంతాలుగా పంచేసుకుని.. సొంత ప్రభుత్వాలను నడిపించేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో… ఎందుకు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి… తన జిల్లా వరకూ.. ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలైనా తానే తీసుకుంటానని చేతలతో స్పష్టం చేస్తున్నారు.