సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా .. రఘురామకృష్ణరాజును డిశ్చార్జ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని… గుంటూరుకు తీసుకు రావాలని పదిహేను మంది సభ్యుల టీమ్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పంపించారు. ఆ విషయం.. ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘు రామరాజుకు ఎలా తెలిసింది..?. ఆయన తన లాయర్లతో కోర్టు ధిక్కరణ నోటీసులు ఎలా ఇప్పించగలిగారు..?. ఇది మిస్టరీనే. కానీ.. నిజంగా ఆ పోలీసులే రఘురామకృష్ణరాజుకు సాక్ష్యాలిచ్చారు. ఆయన వెనుక ఓ కుట్ర జరుగుతోందన్న దానికి సాక్ష్యాలిచ్చి వెళ్లారు. వాటితోనే ఇప్పుడు.. రఘురామకృష్ణరాజు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కేపీ రెడ్డి అనే ఆస్పత్రి రిజిస్ట్రార్‌ను ప్రధానంగా ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… ఆర్మీ ఆస్పత్రిలో వైద్య చికిత్సకు అయ్యే బిల్లులు మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలి. ఆయకు కల్పించిన వై సెక్యూరి్టీ భద్రత ఖర్చులు కూడా ఆయనే భరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు.. బెయిల్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఆయన చేతికి మిలటరీ సిబ్బంది బిల్లు ఇచ్చారు. అందులో ఉన్న వివరాలు చూసి.. రఘురామకృష్ణరాజుకు అసలు కుట్ర అర్థమయింది. తనకు రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది కాకుండా.. గుంటూరు నుంచి వచ్చిన పదిహేను మంది పోలీసుల క్యాంటీన్ ఖర్చులు కూడా అందులో ఉన్నాయి. అసలు వారు లోపలికి ఎలా వచ్చారు.. ? ఎవరి అకామిడేషన్ కల్పించారు..? లాంటి వివరాలన్నీ వెలికి తీశారు.
ఆ పోలీసులు రఘురామకృష్ణరాజు కోసమే వచ్చామని వారు చెప్పి బిల్లు కట్టలేదు. దాంతో వారి బిల్లు మిలటరీ ఆస్పత్రి రఘురామకృష్ణరాజుకు పంపింది. అయినంత బిల్లు చెల్లించేసి.. ఆ బిల్లును భద్రంగా పెట్టుకున్న రఘురామకృష్ణరాజు నేరుగా కేంద్ర రక్షణ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఆస్పత్రి లోపలికి పోలీసులు వచ్చేలా సహకరించింది.. మిలటరీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి అని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి నుంచి తనను త్వరగా డిశ్చార్జ్ చేసి.. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించేందుకు . టీటీడీ జేఈవోగా ఉన్న ధర్మారెడ్డితో కలిసి కుట్ర చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు .. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ జేఈవోగా ఉన్నప్పుడు.. ఆయన రక్షణ శాఖలో అకౌంట్స్ విభాగం ఉద్యోగి. ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జగన్ అధికారంలోకి రాగానే ఏపీ సర్వీస్‌లోకి వచ్చారు.
మిలటరీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నిరంతరం ఫోన్లలో మాట్లాడుకుంటూ.. కుట్ర పన్నారని రఘురామరాజు చెబుతున్నారు. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్.. కేపీ రెడ్డి డాక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారని.. రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. కేపీ రెడ్డి, ధర్మారెడ్డి, అమ్మిరెడ్డిల మధ్య జరిగిన ఫోన్ కాల్స్ వివరాలు బయటకు వస్తే.. మొత్తం కుట్ర వెలుగులోకి వస్తుందని రఘురామకృష్ణరాజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించారు. విచారణ జరిపిస్తామని రాజ్‌నాథ్ కూడా హామీ ఇచ్చారు.