బెంగాల్లో మమతా బెనర్జీని నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా వలసల్ని ప్రోత్సహించింది. సీబీఐ బూచినో.. మరొకటో చూపించి.. అందర్నీ తమ పార్టీలో చేర్చుకుంది. వారితోనే మమతా బెనర్జీపై పోరాటం ప్రారంభించింది. నిన్నామొన్నటిదాకా మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెను సవాల్ చేస్తున్నారు. ఇదే వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తోంది. ఈటల రాజేందర్‌ని పార్టీలోకి తీసుకుని.. కేసీఆర్ వేటను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఈటల సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈటలను కేసీఆర్.. అత్యంత అవమానకరంగా బయటకు పంపారు. ఆ అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈటల రాజేందర్ అంటే… టీఆర్ఎస్లో ఉండే ప్రచారం.. కేసీఆర్ తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో రహస్యాలు ఏమైనా ఉంటే.. . ముందుగా అవి ఈటల రాజేందర్‌కే తెలుస్తాయి. అలాంటి రహస్యాలు కూడా ఇప్పుడు ఈటలతో పాటు బీజేపీలోకి వెళ్తున్నాయి. వాటి ఆధారంగా భారతీయ జనతాపార్టీ కేసీఆర్‌ను టార్గెట్ చేయకుండా ఉండటానికి చాన్సే లేదు. తనను వేటాడిన కేసీఆర్ సంగతి తేల్చాలనే ఈటల కూడా అనుకుంటారు. దీంతో.. బీజేపీ పని మరింత సులువు అవుతుంది. కేసీఆర్ జైలుకు అని చాలా రోజులుగా బండి సంజయ్ చెబుతూ వస్తున్నారు. కానీ దానికి సరైన గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ కాలేదని… బీజేపీ నేతలు చెబుతూంటారు. ఇప్పుడు ఈటల రాకతో.. అలాంటి గ్రౌండ్ ఏర్పాటు అవుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆ పార్టీ కాస్త పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ.. కేసీఆర్ తనదైన .. సంధి రాజకీయం చేసి.. బీజేపీని మళ్లీ వెనక్కి నెట్టగలిగారు. అలాంటి చాన్స్ ఇక కేసీఆర్‌కు ఇవ్వకుండా.. ఈటలను ముందు పెట్టి.. బెంగాల్ తరహా రాజకీయాలను ప్రారంభించాలన్న ఆలోచనను హైకమాండ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక ఖాయమయింది. చేరిన తర్వాత ఎప్పట్నుంచి యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తారనేది వేచి చూడాలి. మొత్తంగా అయితే.. బీజేపీ చాలా సీరియస్‌గా కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం మాత్రం ఖాయమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదంటున్నారు.