రఘురామకృష్ణరాజు ప్రెస్మీట్లను ప్రసారం చేశారంటూ.. ఆయనతో పాటు టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై రాజద్రోహం కేసులను ఏపీ సీఐడీ నమోదు చేసింది. ఈ కేసులపై… రెండు చానళ్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ప్రభుత్వం మీడియాను బెదిరించేలా వ్యవహరిస్తోందని.. రాజద్రోహం కేసులను కావాలనే పెట్టిందని ఆరోపిస్తూ.. పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ కేసు విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ దుందుడుకు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ అంశాన్ని రాజద్రోహం గా చూడటం సమంజసం కాదని ధర్మానసం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
రాజద్రోహం కేసుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజానికి గతంలోనూ … ఇలాంటి రాజద్రోహం కేసులు..జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ముందుకు వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124 Aను ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయంతో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏప్రిల్ 30వ తేదీన 124A సెక్షన్ వాలిడిటీపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చను పౌరులకు కల్పించారు. అయితే.. ఇటీవలి కాలంలో ఐపీసీలోని సెక్షన్ 124Aను అధికారంలో ఉన్న వారు విరివిగా అమలు చేస్తున్నారు.
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారు. నిజానికి హేట్ స్పీచ్ అనేది నేరమని.. 124A సెక్షన్ కింద శిక్ష విధించవచ్చని చెబుతున్నారు. కానీ హేట్ స్పీచ్ అనేదానికి అసలు నిర్వచనమే లేదు. ఏది హేట్ స్పీచ్.. ఏది కాదు అన్నదానిపై స్పష్టత లేదు. దీన్నే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా 124A సెక్షన్‌పై వ్యాలిడిటీపై ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని నియమిస్తోంది. ఈ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.