మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఓ ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండి ఉంటే… ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుని ఉంటే.. ఈ పాటికి సక్సెస్ స్టోరీ అయ్యేదని చాలా మంది విశ్లేషిస్తూంటారు. నమ్మిన వాళ్లు వంచించడమో… ఇక భవిష్యత్ లేదనుకున్న తన ఆలోచనో కానీ చిరంజీవి… కాడి దించేశారు. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. రాష్ట్ర విభజన చేసి…కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో చిరంజీవి పరిస్థితి మొదటికి వచ్చింది. చివరికి ఆయన రాజకీయాలకు అనధికారిక రిటైర్మెంట్ ప్రకటించి.. సినిమాలు చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు తానిక రాజకీయాల్లోకి రానని.. తమ్ముడు పవన్ కల్యాణ్ ద్వారా సందేశం పంపించారు. కానీ.. ఇప్పుడు చిరంజీవి మనసు మారినట్లుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో చిరంజీవి.. తన సేవా కార్యక్రమాలకు ఎక్కువగా కవరేజ్ కోరుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలలో ఉన్న వారికే కాదు… తన అభిమానులకు సైతం.. ఫోన్లు చేసి.. ప్రతినిధుల్ని పంపి.. సహాయం చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకుల విషయంలో.. విపరీతంగా మైలేజీ వస్తుందని ఆశించారు. కానీ రాకపోయే సరికి నిరాశపడ్డారు.
ఆంధ్రప్రభ ముత్తా గోపాలకృష్ణ ఓ ఆర్టికల్ రాసేసరికి పొంగిపోయారు. ఆయనకు నేరుగా ఫోన్ చేసి.. ఇతర మీడియా అంత కవరేజీ ఇవ్వలేదని.. బాధపడ్డారు. నిజానికి ఆంధ్రప్రభ అనే పత్రిక .. కేవలం..ముద్రితం అవుతోంది అని చూపించుకోవడానికి తప్ప…అమ్మకానికి ఎక్కడా ప్రింట్ కాదు. కానీ ఈ పేపర్ లో.. క్లిప్‌లు.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంతమాత్రం దానికే చిరంజీవి ఎందుకు అంత ఇదయ్యారో చాలా మందికి అర్థం కాలేదు. అయితే.. తన సేవానిరతిని ప్రజలు బాగా గుర్తించాలని మాత్రం చిరంజీవి కోరుకుంటున్నారు.
తాను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారని.. బాస్ ఈజ్ బ్యాక్ అనేపద్దతిలో రావాలంటే..పొలిటికల్‌గా తన ఇమేజ్ మేకోవర్ అవ్వాలని కోరుకుంటున్నారని అంటున్నారు. అందుకే.. సేవా కార్యక్రమాలు చేసి.. ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేందుకు ప్రత్యేకంగా పీఆర్ టీంను పెట్టుకున్నారని చెబుతున్నారు. నిజంగానే చిరంజీవికి రాజకీయాలపై మళ్లీ మనసు మళ్లితే… ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు రావడం ఖాయంగా చెప్పుకోవచ్చు.