జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి మూడు సార్లు వాయిదాలు అడిగిన సీబీఐ.. చివరికి మూడు అంటే మూడు లైన్ల కౌంటర్ మాత్రమే దాఖలు చేసింది. లాక్డౌన్ నిబంధనల వల్ల.. ఏదో పెద్ద డాక్యుమెంట్లు తీసుకు రాలేకపోతున్నట్లుగా సీబీఐ తరపు న్యాయవాది పదే పదే వాయిదాలు అడిగారు. చివరికి సీబీఐ కోర్టు.. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పడంతో తప్పనిసరి అన్నట్లుగా.. మూడు అంటే మూడు లైన్లు.. అదీ కూడా.. తాము చెప్పేది ఏమీలేదని.. కేసు మెరిట్స్ ప్రకారం కోర్టే నిర్ణయం తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సీబీఐ తీరుపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
సీబీఐ కోర్టు చివరి అవకాశం ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు కూడా.. కౌంటర్ దాఖలు చేశారు. మొత్తం 98 పేజీల కౌంటర్లో… జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని.. సీబీఐని ప్రభావితం చేయలేదని.. అలాగే.. సాక్షులను బెదిరించడం.. ఆయాచితంగా లబ్ది చేకూర్చడం వంటివి చేయలేదని వివరించారు. తదుపరి విచారణను.. సీబీఐ కోర్టు పధ్నాలుగో తేదీకి వాయిదా వేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. అన్ని రకాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘించినందున ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
సీబీఐ వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే.. ఉల్లంఘిస్తున్నారని చెప్పాలి.. లేకపోతే లేదని చెప్పాలి..కానీ మధ్యే మార్గంగా సీబీఐ.. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా కేసు మెరిట్స్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా కౌంటర్ దాఖలు చేయడం .. ఆసక్తి రేపుతోంది. ఈ కేసు విషయంలో సీబీఐని ప్రభావితం చేస్తున్నారని.. రఘురామకృష్ణరాజు.. తన బెయిల్ రద్దు పిటిషన్లో చేర్చిన సమయంలోనే… ఇలా సీబీఐ కౌంటర్ దాఖలు చేయడం.. న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది.
పధ్నాలుగో తేదీ నుంచి జరగనున్న వాదనల్లో సీబీఐ తరపు న్యాయవాది.. ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తికరం. అసలు వాదనలు చేయకుండా ఉంటారా.. అన్నది మరో కోణం. సీబీఐ… జరుగుతున్న పరిణామాలపై గట్టిగా ఉంటే.. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందనే అంచనా ఉంది.