కరోనా బాధితులకు సాయం చేసే విషయంలో సోషల్ మీడియాలో కొంత మందికి స్పెషల్ క్రేజ్ వస్తోంది. దీనికి కారణం సోషల్ మీడియా విజ్ఞప్తులకు స్పందించి.. వారి కష్టాలు తీర్చడమే. ఇలాంటి వారిలో సోనూసూద్ తో పాటు.. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ కూడా ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ ఒకరికొక్కరు తెగ పొగిడేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. విషయమేమిటంటే.. మంత్రి కేటీఆర్ … తన ట్విట్టర్ అకౌంట్‌కు వచ్చే విజ్ఞప్తులపై ప్రత్యేకంగా స్పందిస్తారు. ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన ట్వీట్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే.. చివరికి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా.. ట్వీట్ ద్వారానే కేటీఆర్‌ను అప్రోచ్ అయ్యారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరం అయితే.. కేటీఆర్ సమకూర్చారు. అతను తన కృతజ్ఞతను సోషల్ మీడియాలోనే తెలిపారు. కేటీఆర్‌ను రియల్ హీరో అని పొగిడారు. అయితే.. తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి… బాధ్యత నిర్వహిస్తున్నానని.. కానీ సోనూసూద్ అలా కాదని.. ఆయనే రియల్ హీరో అని ప్రశంసించారు. కేటీఆర్ తనను పొడిగిన విషయా్ని సోనూసూద్ కూడా లైట్ తీసుకోలేదు. తిరిగి పొగిడారు. తెలంగాణ కోసం కేటీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని.. అభినందించారు. వీరి పరస్పర అభినందనలు ట్విట్టర్లో కాసేపు ట్రెండింగ్‌లో నిలిచాయి.