కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తన రాజకీయ అడుగులపై పడకుండా .. వైఎస్ షర్మిల గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను రేసులో ఉన్నానని తెలియాలంటే.. కొండనే ఢీకొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలోనే ఈ అంశంపై చూచాయగా చెప్పిన షర్మిల ఇప్పుడు.. ఓ పూట లాక్ డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడంతో ఆ సమయంలో రాజకీయ పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా కేసీఆర్‌తోనే ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నిరుద్యోగుల అంశాన్ని టేకప్ చేసిన షర్మిల.. జిల్లాల వారీగా దీక్షలకు పిలుపునిచ్చిన సమయంలో కరోనా విరుచుకుపడింది. దాంతో వాటికి బ్రేక్ ఇచ్చారు.
అయితే.. వీడియోల ద్వారానో.. ట్వీట్ల ద్వారానో ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు రాక.. ఇక రావేమోననే ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాన్నే టార్గెట్ చేశారు. గజ్వేల్‌లో కొంత మంది యువకులు ఆత్మహత్య లు చేసుకున్నారు. వారిని పరామర్శించడానికి బుధవారం గజ్వేల్ వెళ్తున్నారు. నిజానికి షర్మిల ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ దీక్ష చేసినప్పుడు… ఆ దీక్షను నాటకీయ పరిణామాల మధ్య ఇంట్లో కొనసాగించిన తర్వాత.. దీక్షను విరమింప చేయడానికి గజ్వేల్ యువకుల కుటుంబసభ్యులే వచ్చారు.
ఇప్పుడు వారిని పరామర్శించడానికి షర్మిల గజ్వేల్ వెళ్తున్నారు. గన్‌పార్క్ వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీగా గజ్వేల్‌కు వెళ్తారు. సాధారణంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పర్యటన అంటే మీడియా ఫోకస్ ఉంటుంది. అందుకే షర్మిల గజ్వేల్‌ను ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. నేరుగా కేసీఆర్‌ను ఢీకొడితేనే హైప్ వస్తుందని.. ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఆ ప్రకారం రంగంలోకి దిగుతున్నారు. పార్టీని అధికారికంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ప్రకటించనున్నారు.