నెలరోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్- తన పార్టీ నేతలను కాపాడుకోవడం. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి బిజెపిలో చేరడం పార్టీకి ఎన్నికలకు ముందు భారీ కుదుపునిచ్చింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బిజెపిలో చేరిన నేతల్లో చాలామంది ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మే 2 న మమతా బెనర్జీ విజయం సాధించి, యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచారు. తృణమూల్ కాంగ్రెస్ 292 అసెంబ్లీ స్థానాల్లో 213 గెలిచి, బిజెపి 77 స్థానాలకు పరిమితం కావడం తెలిసిందే. దీంతో అప్పట్లో పార్టీ వీడి వెళ్లిన నేతలు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా, మార్చిలో తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ ఇమడలేక పోతున్నానని, తిరిగి సొంత గూటికి రావాలనిపిస్తోందనీ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొక నేత దీపేందు బిస్వాస్ కూడా తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ మమతా బెనర్జీ కి లేఖ రాశారు. సరాలా ముర్ము, అమల్ ఆచార్య , మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ లాంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే, పార్టీ నాయకులు మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కూడా బిజెపి పార్టీ నుండి తృణమూల్ కాంగ్రెస్ లోనికి జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు, బిజెపికి చెందిన 3-4 మంది సిట్టింగ్ ఎంపిలు తృణమూల్ కాంగ్రెస్లో చేరాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే, వీరిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే విషయంలో మమతాబెనర్జీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎవరెవరిని పార్టీలోకి తిరిగి తీసుకోవాలి అన్నదానిపై నిర్ణయించాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్లు సమాచారం.