ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఇటీవల ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒక్క మీడియాపైనే కాదు.. కమెడియన్లనూ వదిలి పెట్టడం లేదు. ఈ కేసుల వ్యాలిడిటీపై చర్చ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం.. ఇప్పుడు .. హాట్ టాపిక్ అవుతోంది. రాజద్రోహం .. దేశద్రోహం కేసుల పేరుతో ప్రభుత్వాలు వ్యతిరేక స్వరాలను అణిచివేయడం కోసం ఇటీవల కొంత మంది అధికారం చేతుల్లో ఉన్నవారు బరి తెగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుల సంగతి తేల్చాలన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.
హవ్వ.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజద్రోహమా..?
సెక్షన్ 124A. ఇది బ్రిటిషన్ కాలంలో అప్పటి పాలకులు… స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాన్ని అణిచివేయడానికి పెట్టుకున్న సెక్షన్. స్వాతంత్ర్యం తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లో అది కంటిన్యూ అవుతోంది. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చను పౌరులకు కల్పించారు. హేట్ స్పీచ్ అనేది నేరమని.. 124A సెక్షన్ కింద రాజద్రోహం శిక్ష విధించవచ్చని ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉంది. కానీ హేట్ స్పీచ్ అనేదానికి అసలు నిర్వచనమే లేదు. ఏది హేట్ స్పీచ్.. ఏది కాదు అన్నదానిపై స్పష్టత లేదు. దీన్నే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై ఆ సెక్షన్ ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు తీవ్రమయిన నేరాలు, మిలిటెంట్ రాజకీయాలను ఆచరించేవారిపై ఇటువంటి కేసులు పెట్టే పోలీసు యంత్రాంగాలు, ఇప్పుడు సాధారణ రాజకీయ ప్రత్యర్థుల మీద, మీడియా మీద కూడా మోపుతున్నారు. ఫలితంగా చర్చ ప్రారంభమయింది.
ప్రత్యర్థులందర్నీ జైల్లో పెట్టేసి నియంత రాజ్యం తీసుకొస్తారా..?
రాజద్రోహం సెక్షన్‌ను ప్రభుత్వాలు ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాయో చెప్పేందుకు ఉదహరణలు చాలా ఉన్నాయి. కునాల్ కమ్రా అనే ఓ స్టాండప్ కమెడియన్ విమానంలో వెళ్తూండగా ప్రధాని మోడీని తన కామెడీ స్టైల్లో అనుకరించారని రాజద్రోహం కేసు పెట్టేశారు. ఆయన కమెడియన్ కదా.. అని స్పోర్టివ్‌గా తీసుకోలేదు. కప్పన్ అనే కేరళకు చెందిన జర్నలిస్ట్.. యూపీలో జరిగిన హథ్రాస్ అత్యాచారం, హత్య ఘటనను రిపోర్ట్ చేయడానికి .. అక్కడకు వెళ్లారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికీ ఆ జర్నలిస్ట్ జైల్లోనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం.. అనురాగ్ కశ్యప్‌తో పాటు కొంత మంది సినీ ప్రముఖులు దేశంలో పరిస్థితులపై ఓ లేఖను ప్రధాని మోదీకి రాశారు. దాన్ని కూడా సెడిషన్ కింద పరిగణించేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశంలో రాజద్రోహం కేసులు లెక్కకు మిక్కిలిగా తేలుతున్నాయి. ఏపీలో ప్రభుత్వాన్ని విమర్శించారని రఘురామకృష్ణరాజుపైనా… ఆయన ప్రెస్‌మీట్ ప్రసారం చేశారని మీడియాపై రాజద్రోహం కేసులు పెట్టారు. అంతకు ముందే జడ్జి రామకృష్ణపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం కేసు పెట్టి జైల్లో వేశారు.
ఒక్క మీడియా సమస్య కాదు.. ప్రజాస్వామ్య సమస్య..!
ఒక్క మీడియా మాత్రమే కాదు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజద్రోహం కేసుల పాలైన ఉమర్ ఖాలిద్, కప్పన్, కన్హయ్య లాంటి విద్యార్థి నాయకులు కూడా… బాధితులే.చివరికి సోషల్ మీడియాలో విమర్శలు చేసినా సెడిషన్ కేసులు పెడుతున్నారు. వీటిని ఇలా వదిలేస్తే… రేపు ప్రతిపక్ష నేతలుఅనే వారిని లేకుండా రాజద్రోహం కేసులో జైల్లో పెట్టేసి.. నియంతన పాలనను మన పాలకులు తీసుకొచ్చినా తీసుకొస్తారు. అందుకే.. రాజద్రోహం కేసులకు స్పష్టమైన నిర్వచనం రావాల్సి ఉంది.