వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మీదనే ఎక్కువ ఆసక్తి ఉంది. కోర్టులను లెక్క చేయకుండా అయినా సరే.. విశాఖ నుంచి పరిపాలన సాగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉన్నారు. సీఆర్డీఏ చట్టానికి, 3 రాజధానులకు సంబంధం లేదని సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చని.. దానికి కోర్టు కేసులు.. తీర్పులతో సంబంధం లేదని తాజాగా ఆయన విశాఖలో చెప్పుకొచ్చారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తప్పకుండా వస్తుందని కానీ డేట్ మాత్రం అడగొద్దని ఆయన మీడియాతో నేరుగా చెప్పేశారు.
ఇటీవలి కాలంలో మూడు రాజధానుల గురించి ప్రభుత్వం మాటలు తగ్గించింది. ఏపీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం.. కరోనా కారణంగా కొత్త కష్టాలు రావడంతో మూడు రాజధానుల గురించి మాట్లాడటం లేదు. సందర్భం వచ్చినప్పుడు బొత్స, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు మాత్రం మూడు రాజధానులు చేసి తీరుతామని ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు.. అమరావతి లాంటి చోట్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లుగా లీకులిస్తారు. కానీ ఒఒక్క అడుగు కూడా ముందుకు పడదు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బొత్స అవే ప్రకటనలు చేశాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేస్తున్నారు.
నిజానికి మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో పెడుతున్నప్పుడు… సీఎం జగన్.. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చని.. రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదని ప్రకటనలు చేశారు. అలా చేసిన వారు చట్టాలు ఎందుకు చేయాలనుకున్నారో క్లారిటీ లేదు కానీ.. అవి న్యాయ చిక్కుల్లో ఇరుక్కున్నాయి. అదే సమయంలో విశాఖలో కార్యాలయాలు చూసుకునే పనిని కూడా వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు తగ్గించారు. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని హైలెట్ చేయడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.