బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలియని వారెవరు ఉండరు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడల్లా.. అప్పుడే చెప్పేను బ్రహ్మంగారు అంటూ… ప్రచారం జరుగుతూ ఉంటుంది. పాత తరానికి బ్రహ్మంగారి కాలజ్ఞానం కంఠతా వచ్చు. కొత్త తరం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. అలాంటి కాలజ్ఞానం సృష్టించిన బ్రహ్మంగారి మఠం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతు లూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం.. పీఠం కోసం రెండు కుటుంబాలు… మాకంటే మాకని పోటీ పడుతున్నాయి. వారి మధ్య పంచాయతీ తీర్చడానికి పెద్ద ఎత్తున పీఠాధిపతులు రంగంలోకి దిగాల్సి వస్తోంది.
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం పీఠాధిపతిగా శ్రీ వీరబోగ వసంత వేంకటేశ్వర స్వాములు ఉండేవారు. ఆయన ఇటీవల చనిపోయారు. దీంతో పీఠానికి వారసుడ్ని ఎంపిక చేయాల్సి ఉంది. సాధారణంగా పెద్దకొడుకు వారసుడు అవుతారు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది. శ్రీ వీరబోగ వసంత వేంకటేశ్వర స్వాములుకి ఇద్దరు భార్యలు. ఇద్దరికీ మగపిల్లలు ఉన్నారు. దీంతో ఇద్దరి భార్యల కుమారుడు.. పీఠానికి వారసుడ్ని తానేనని.. వాదించడం ప్రారంభించారు. ఊరి పెద్దలు, దేవాదయశాఖ అధికారులు పరిష్కరించాలని ప్రయత్నం చేసినప్పటికి ఫలించలేదు. వివాదం పెద్దదయింది.
దేవస్థాన ప్రతిష్టకు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారసత్వ పోరు మారడంతో… ఇతర పీఠాల అధిపతులు రంగంలోకి దిగారు. వివిధ దేవస్థానాల పీఠాధిపతులు 12 మంది బ్రహ్మం గారి మఠం చేసురుకొని సమస్య మరింత తీవ్రం కాకుండా ఇరుకుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. వంశపారం పర్యంగా వస్తున్న పద్ధతులను పాటిస్తూ పూర్వపు పీఠాధిపతుల మొదటి భార్య పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామినే పీఠాధిపతి గా నియమించాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ గతంలో పీఠాధిపతి రాసిన వీలునామా ప్రకారం… తనకే పీఠాధిపతి ఇవ్వాలని చిన్న భార్యకుమారుడు పట్టు బడుతున్నారు. వీరి మధ్య సమస్యను పరిష్కరించడం తలకు మించిన భారంగా మారింది. ఎక్కడ మీడియాకు ఎక్కి… మఠం పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.