కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. పుట్టుకొచ్చిన కొత్త హీరో సోనూసూద్. తను చేసిన సేవా కార్యక్రమాలకే అంతే లేదు. కోట్లాది రూపాయలు సమాజ సేవ నిమిత్తం ఖర్చు పెడుతున్నాడు. అడిగినవాళ్లకు, అడగనివాళ్లకూ.. నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నాడు. సోనూ సేవతో.. తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. తను ఇప్పుడు రియల్ హీరో. తనతో సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలూ రెడీగా ఉన్నారు. తను హీరోగా కొన్ని ప్రాజెక్టులు మొదలవ్వబోతున్నాయని పరిశ్రమలో టాక్. దర్శకుడు క్రిష్ కూడా సోనూసూద్ కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడని, ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని వార్తలొచ్చాయి.
అయితే.. సోనూసూద్ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ఖండించాయి. అసలు క్రిష్.. సోనూసూద్ ల మధ్య భేటీ జరగలేదని, ఈ కాంబోలో సినిమా అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశాయి. నిజానికి సోనూ.. కాల్షీట్లు ఏమాత్రం ఖాళీ లేవు. ఇప్పటికి తన చేతిలో ఆరు సినిమాలున్నాయట. అన్నీ.. ప్రధాన పాత్రధారిగానే. ఎందులోనూ హీరో కాదు. హీరోగా తనకొచ్చిన స్క్రిప్టుల్ని సోనూ పక్కన పెట్టాడని, తన దృష్టి ఇప్పుడు హీరోయిజంపై లేదని, ప్రస్తుతం తన ఇమేజ్, తన కెరీర్‌కి భంగం కలిగించకుండా ఉండాలన్న జాగ్రత్తలో సోనూ ఉన్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. క్రిష్ అనే కాదు.. ఎవరు,.. హీరో ప్రతిపాదనతో వచ్చినా సోనూ తిరస్కరించేలానే ఉన్నాడు.