ఈటల రాజేందర్ అనుకున్నట్లుగానే ఎమ్మెల్యే పదవికి.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉదయం తన ఇంట్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి.. చెప్పాలనుకున్నదంతా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలు.. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు.. స్వేచ్చ లేకపోవడం వంటి అంశాలన్నింటినీ ఏకరవు పెట్టారు. ఉద్యమ కాలం నుంచి తాను కష్టపడి పని చేస్తేనే పదవులు వచ్చాయని.. మస్కా కొడితే రాలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆత్మగౌరవం మీద దెబ్బకొడుతున్నారని.. ఓ అనామకుడు లేఖ రాస్తే… తనను బర్తరఫ్ చేశారని.. కనీసం ఏం జరిగిందని కూడా ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నిర్బంధం.. సమైక్య పాలనలో ఉంటే.. ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదన్నారు.
ఈటల రాజేందర్ రాజీనామా చేయబోతున్నట్లుగా నిన్ననే మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈటల అనుచరులు.. ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ తొలి తరం నాయకులు అయిన ఏనుగు రవీందర్ రెడ్డి , కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ లాంటి వాళ్లు ఆయనతో పాటు ఉన్నారు. వారు కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఉపఎన్నికల ప్రస్తావన కూడా ఈటల తీసుకొచ్చారు. ఉద్యమ నాయకుల్ని గెలిపించిన చరిత్ర కరీంనగర్‌కు ఉందని… కేసీఆర్ డబ్బు సంచులకు.. హూజూరాబాద్ ప్రజలు బొంద పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈటల వ్యూహాత్మకంగా హరీష్ రావు లాంటి వారిపై సానుభూతిచూపించారు. ఆయన కూడా చాలా అవమానాలను ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.
ఈటల చాలా చెప్పారు కానీ.. బీజేపీలో చేరబోతున్న విషయంపై మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో ఈటల సంప్రదింపులు జరిపి వచ్చారు. ఎనిమిదో తేదీన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ..ఈటల ఈ విషయంలో కనీసం సూచనలు కూడా ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ ముగించడం ఆసక్తి కలిగిస్తోంది.