ఒకప్పటి హీరోయిన్ , ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ భాగస్వామిగా ఉన్న జూహీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు రూ. 20 లక్షల జరిమానా విధించింది. తనను తాను పర్యావరణ ఉద్యమకారణిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకో.. లేక ప్రచారం కోసం తాపత్రయ పడ్డారో కానీ.. ఫైజీ వల్ల పశుపక్ష్యాదులకు పెద్ద ఎత్తున నష్టం కలుగుతోందని.. తక్షణం ఫైవ్ జీ నెట్ వర్క్ ను బ్యాన్ చేస్తూ ఆదేశాలివ్వాలని ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 5జీ వల్ల .. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో.. కనీస రీసెర్చ్ ఆధారాలు కూడా సమర్పించలేదు.
దీంతో ఢిల్లీ హైకోర్టు జూహీచావ్లాపై అసహనం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం పిటిషన్ వేసినట్లుగా ఉందని తేల్చింది. రూ. 20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే.. ఈ పిటిషన్ వేయడమే…జరిమానా విధించడానికి కారణం కాదు. కోర్టు విచారణలన్నీ ఆన్ లైన్లో జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా.. విచారణ లింక్‌ను పిటిషనర్లకు పంపుతూంటారు. విచారణను పిటిషనర్లు చూస్తూంటారు.
అయితే జూహిచావ్లా తనకు అందిన విచారణ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. ఆ లింక్ చూసిన వాళ్లందరూ.. ఓపెన్ చేయడం ప్రారంభించారు. దీంతో కోర్టు ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఒక సారి కాదు..మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. దీంతో న్యాయప్రక్రియను జూహీచావ్లా అవమానించారని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. రూ. 20లక్షల భారీ ఫైన్ విధించింది. ఏదో చేయాలనుకున్న జూహీచావ్లాకు చివరికి రూ. ఇరవై లక్షల చేతి చమురు వదిలింది.