ఇప్పుడు ఫోన్ అంటే… కాల్స్ ఇన్ కమింగ్.. ఔట్ గోయింగ్ మాత్రమే కాదు. ఫోన్ యూజర్ వ్యక్తిగత సమాచారం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి ఫోన్ పరాయి వ్యక్తుల చేతుల్లో పడితే ఎంత ప్రమాదమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులు అందుకే ఎవరినైనా అదుపులోకి తీసుకుంటే ముందుగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకుంటారు. రాజద్రోహం కేసులో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు కూడా ఆయన ఫోన్‌ను స్వాధీనంచేసుకున్నారు. వాస్తవానికి స్వాధీనంచేసుకున్న వస్తువులన్నింటినీ వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అనధికారికంగా వాటిని చెక్ చేయడం.. వాడటం.. సమాచారాన్ని సేకరించడం చేయకూడదు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫోన్‌ను.. పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. దీంతో ఆయన..తన వ్యక్తిగత ఫోన్ నుంచి సమాచారాన్ని సంగ్రహిస్తున్నారని అనుమానం వచ్చి… నేరుగా పోలీసులకే లీగల్ నోటీసులు పంపించారు.
సీఐడీ అదనపు ఏడీజీ సునీల్ కుమార్‌తో పాటు మంగళగిరి సీఐడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకుఈ నోటీసులు పంపించారు. తన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదని.. అందులో ఎంపీగా తాను నిర్వహించవలసిన విధులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కీలకమైన సమాచారం కూడా ఫోన్లో ఉందన్నారు. తక్షణ తన ఫోన్‌ను తనకు అంద చేయకపోతే.. సివిల్, క్రమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కస్టడీలో తనను సీఐడీ పోలీులు హింసించారని.. ఫోన్‌ను అన్ లాక్ చేయమని కూడా హింసించారని రఘురామ ఆరోపించారు. ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడ ఉందన్నది సస్పెన్స్‌గా మారింది. యాపిల్ ఐ ఫోన్ ను అన్ లాక్ చేయడం అంత సులభం కాదు. అయితే సీఐడీ తల్చుకుంటే చేయవచ్చు. అందులో సమాచారం యాక్సెస్ చేస్తే వ్యక్తిగత విషయాలన్నీ బయటకు వస్తాయి. కొద్ది రోజల కిందట…ఓ కేసులో జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఎక్కడో పోయిందని చెప్పారు. ఈ విషయం కూడా వివాదాస్పదమయింది. ఇప్పుడు..రఘురామకృష్ణరాజు ఫోన్ గురించి… సీఐడీ అధికారులు ఏం చెబుతారో వేచి చూడాల్సి ఉంది.