తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఇప్పుడు హూజూరాబాద్పై దృష్టిపెట్టారు. బలం బలగాన్ని అక్కడికి తరలించేస్తున్నారు. ఇంత కాలం అక్కడ తిరుగులేని నాయకుడిగా ఉన్న ఈటలకు ప్రత్యామ్నాయ నేత రెడీ అయినా అవ్వకపోయినా… అక్కడి టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడకుండా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఈటల రాజేందర్ నోటి నుండి వచ్చిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హుజూరాబాద్‌లో మీ అధికారం.. డబ్బు సంచులు… తాత్కాలికంగా గెలవొచ్చేమో కానీ అంటూ మాట్లాడారు. అంటే హూజూరాబాద్‌లో తనకు గెలుపు చాన్సులు లేవని ఆయన ఒప్పుకున్నట్లుగా అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈటల రాజేందర్ నిజానికి .. ఇండి పెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన అనుచరులు చాలా వరకూ ఆయనతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను అమలు చేసింది. అధికారులను సైతం బదిలీ చేసింది. చివరికి సొంత వ్యక్తులు ఆయనను కలవడానికి కూడా తంటాలు పడాల్సిన పరిస్థితి. అందుకే తోడేళ్లలా వేటాడుతున్నారని ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే.. ఉపఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మరింతతీవ్రంగా మారుతుందని..అప్పుడు తట్టుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఈటల ఉన్నారంటున్నారు.
అందుకే బీజేపీలో చేరిక నిర్ణయం తీసుకున్న ఈటల వ్యూహాత్మకంగా.. బీజేపీ దగ్గర నుంచిపెద్ద పదవులే ఆఫర్ పొందారు. ఉపఎన్నికలో హుజూరాబాద్ నుంచి తన భార్యను నిలబెట్టబోతున్నారని చెబుతున్నారు. ఆమె రెడ్డి సామాజికవర్గానికిచెందిన వారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక ఈటల సామాజికవర్గం అండ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. అక్కడ గెలుపు అంత తేలిక కాదని.. నాగార్జున సాగర్ తరహా ఫలితం వస్తుందని.. ఈటల నమ్ముతున్నట్లుగా ఉన్నారు. ముందుగానే మాటల్లోనే ఈ విషయం ఒప్పుకుని… చేతులెత్తేశారన్న విశ్లేషణలు రావడానికి కారణం అయ్యారు.