ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ మధ్య కొత్త పంచాయతీ ప్రారంభమైంది. జగనన్న ఇళ్లు పేరుతో ఏపీ సర్కార్ ప్రచారం చేసుకుంటున్న ఇళ్లు మొత్తానికి నిధులు కేంద్రమే ఇస్తుదని.. కానీ.. బీజేపీకి కనీస మాత్రం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని.. ఆపార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. మూడు రోజుల క్రితం.. రెండో సారి ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలా ఎందుకు చేశారో చాలా మందికి తెలియదు కానీ… అందులో లోగుట్టు మాత్రం.. వేరే ఉంది. కేంద్రం ఇస్తున్న నిధులో… ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఆ ఇళ్లు కట్టిస్తున్నట్లుగా … కొత్తగా నిర్ణయం తీసుకుని శంకుస్థాపనలు చేశారని. పత్రికా ప్రకటనల్లో కేంద్ర పథకం పేరు లైట్‌గా ప్రస్తావించారు.
కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఏపీకి పద్దెనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి లక్షన్నర ఇస్తుంది. ఏపీ సర్కార్ .. రూ. లక్షా ఎనభై వేలు లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే కేంద్రం ఇచ్చేదానికంటే అదనంగా ముఫ్పై వేలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఉపాధి హామీ పనులకు అనుసంధానం చేస్తున్నారు. అలాంటి చోట్ల.. కేంద్రం ఇచ్చిన దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వదు. ఎలా చూసినా రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు కాదని.. రాయితీలు.. తగ్గింపులు రూపంలో .. ప్రభుత్వానికి కేంద్రం నుంచి వస్తాయని చెబుతున్నారు. బీజేపీ నేతలు ఈ విషయాన్ని పాయింటవుట్ చేసి కొత్తగా వైసీపీ నేతలపై విమర్శలు ప్రారంభించారు.
అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఇళ్లకు నిధులు కేంద్రం ఇస్తోంది కానీ.. స్థలం మాత్రం ఏపీ సర్కార్‌దే. ఇప్పటికే సెంటు చొప్పున స్థలాలు ఇచ్చింది. కానీ.. అక్కడ మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం కాలేదు. తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు నిరమించాల్సి ఉంది. వీటికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంది. ఇవి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిధులే వెచ్చించాలి. అయితే వీటికి చేయబోయే ఖర్చుపై ఏపీ సర్కార్ పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇళ్లు కట్టిస్తున్నామనే చెబుతోంది. దీంతో ఆ ఇళ్లన్నీ.. తామిచ్చినవే…అని బీజేపీ చెప్పుకోవాలని ఆరాట పడుతోంది.
తెలంగాణలో అయితే.. బీజేపీ నేతలు ఇప్పటికి … కేంద్రం నిధులతో కడుతున్నారంటూ.. చేయాల్సిన రచ్చ అంతా చేసేవాళ్లు. పెద్ద ఎత్తున చర్చ పెట్టేవారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. కేంద్రం నిధులతో జగన్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిసినా… సైలంటుగా ఉంటున్నారు. మీడియాలో వచ్చిన తర్వాత తాము క్లెయిమ్ చేసుకోకపోతే.. ఇబ్బంది పడతామని అనుకుంటారో ఏమో కానీ..పెద్దగా వాయిస్ రెయిజ్ చేయకుండా స్పందిస్తూ ఉన్నారు. దీంతో.. ఆ ఇళ్ల విషయంలో క్రెడిట్‌ను మోడీకి దక్కేలా చేయడానికి కన్నా… సైలెంట్‌గా ఉండటానికే వైసీపీ నేతలు ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.