ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం అమిత్ షాను కలవబోతున్నారు. ఆయన ఢిల్లీ వచ్చిన తర్వాత సమయం ఖరారు చేస్తామని అమిత్ షా ఆఫీస్ నుంచి కబురు రావడంతో సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరినీ కలవడం లేదు. ఆయన వర్చువల్‌గా అధికారిక సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే సీఎం జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం.. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు చేస్తూండటంతో.. అమిత్ షా ఆయన అపాయింట్మెంట్ విషయాన్ని పరిశీలించినట్లుగా చెబుతున్నారు.
చుట్టుముట్టిన సమస్యల నుంచి బయటపడటానికి ఢిల్లీలో మార్గాలను వెదకాలని ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇతర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా అడిగినప్పటికీ.. ప్రధానంగా అమిత్ షాతో భేటీ కోసమే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌తో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. రఘురామరాజు ఏపీ సర్కార్ తన విషయంలో వ్యవహరించిన వైనాన్ని సాధ్యమైనంత మందికి చెబుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్‌తో కలిసి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కుట్ర చేశారని ఆధారాలు సమర్పించారు. దీంతో ప్రభుత్వం అమ్మిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేసింది.
అదే సమయంలో రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై సీఐబీ కూడా పిటిషన్ లో ఉండే ‘మెరిట్స్ అండ్ డి మెరిట్స్’ ఆధారంగా మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్ పై ఇటీవలే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. తాజాగా పోలవరం బిల్లులను కూడా కేంద్రం వెనక్కి పంపడంతో ప్రభుత్వానికి చిక్కులు ప్రారంభమయ్యాయి.
సీఎం జగన్ ఎప్పుడు వెళ్లినా అధికారిక పర్యటనలా ఉండదు. వ్యక్తిగత పర్యటనల్లా ఉంటాయి. ఏ వివరాలూ బయటకు చెప్పరు. ఏ వినతి పత్రాలు ఇస్తున్నారో తెలియదు. జగన్‌కు చెందిన మీడియా మాత్రం… రాష్ట్రం కోసం.. జగన్ చర్చించారని చెబుతారు. కానీ ఎవరైనా ఆర్టీఐ చట్టం ద్వారా ఆయన ఏం చర్చించారో అడిగితే… అసలేమీ అడగలేదని సమాధానం వస్తుంది. ఈ సారి కూడా ఆయన… రఘురామకృష్ణరాజు.. బెయిల్ రద్దు పిటిషన్.. ఈడీ విచారణల దూకుడు వంటి అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నారని విపక్షాలు సహజంగానే విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి.