ఏపీ ప్రభుత్వం మళ్లీ గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. కోటి టీకా డోసుల సరఫరా కోసం ముందుకు రావాలని టీకా కంపెనీలను కోరుతోంది. టీకాలు ఏపీ సర్కార్కు పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే ఆర్డర్ పెట్టుకోవాలని కేంద్రం చెప్పింది. అయితే ఏపీ సర్కార్.. ఆ విషయాన్ని లైట్ తీసుకుంది. దీంతో కేంద్రం తన కోటా కింద సరఫరా చేస్తున్న వ్యాక్సిన్లు మాత్రమే ఏపీకి వస్తున్నాయి. వారానికి రెండు లక్షలో.. మూడు లక్షలో టీకా డోసులు వస్తున్నాయి. ఇవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపడవు. ఆర్డర్లు పెట్టకపోవడం వల్ల… ఏపీ సర్కార్ సొంతంగా సీరం,భారత్ బయోటెక్ ల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రష్యా వ్యాక్సిన్ చాలాఖరీదు. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఏపీ సర్కార్ గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. స్పందన రాకపోయే సరికి..ముఖ్యమంత్రులందరికీ లేఖ రాసిన జగన్…మళ్లీ గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆదేశించారు.
మొదటి సారి పిలిచిన టెండర్ల సమయంలో ప్రీబిడ్ సమావేశానికి ఇద్దరు ప్రతినిధులు హాజరైనప్పటికీ వారు టెండర్లు దాఖలు చేయలేదు. ఇదే సమయంలో మహారాష్ట్ర పిలిచిన టెండర్లకు 8 మంది, కర్ణాటక పిలిచిన టెండర్లకు 4గురు, హరియాణా పిలిచిన టెండర్లకు ముగ్గురు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పిలిచిన టెండర్లకు చివరకు దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు కూడా టెండర్లు వేయలేదు. అందులో మరోసారి టెండర్లను పిలువాలని నిర్ణయించారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయడానికి ముందుకొచ్చిన కంపెనీలు.. ఈ సారి తమకూ వస్తాయని ఆశిస్తున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం టెండర్ నిబంధనలు గందరగోళంగా పెట్టింది. వ్యాక్సిన్ సరఫరా చేస్తే.. మొదట సగం ఇస్తామని.. మొత్తం సక్రమంగా సరఫరా చేస్తేనే మిగతావి ఇస్తామనే నిబంధనలు పెట్టారు. ఇలాంటి నిబంధనలు చాలా ఉండటం.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కారణంగా.. ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదని చెబుతారు. చాలా రాష్ట్రాలు ముందుగా అడ్వాన్సులు చెల్లించి టీకాలను బుక్ చేసుకుంటున్నాయి.