తెలంగాణలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనేక కీలక రాజకీయ పరిణామాలకు వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలు కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తున్నాయి. ఆమె పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి కవితపై .. రాజకీయాల్లో ఇంత వైల్డ్‌గా ఎటాక్ చేయడం ఇటీవలి కాలంలో లేదు. పైగా ఇప్పుడు.. బహిరంగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఆమె పాత్ర లేదు. ఈ క్రమంలో విపక్షాలు ఎందుకు.. కవితను టార్గెట్ చేస్తున్నాయన్నదానిపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ విపక్ష నేతలు కవితకు నిన్నటిదాకా లేని ప్రాధాన్యతను ఇప్పుడు ఇవ్వడం ప్రారంభించారు. కల్వకుంట్ల కవిత.. ఏదో ప్రధానమైన పదవిలోకి వెళ్లబోతున్నారని.. ఆందుకే ఆమెపై ఆరోపణలు చేస్తూ.. టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆమె టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. కవితను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖరారు చేశారని అంటున్నారు. కవితను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేసి ఆ తర్వాత కీలక పదవులు అప్పగించేందుకు నిర్ణయించారని ఈ కారణంగానే అనుకుంటున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే కేటీఆర్ సీఎం అయితే సాధ్యం కాకపోవచ్చు. అందుకే కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అది వర్కింగ్ ప్రెసిడెంటే కావొచ్చని అంటున్నారు.
కేసీఆర్ ఏదైనా చేస్తే… పక్కా వ్యూహం.. లెక్కలతోనే చేస్తారు. ఆయన రాజకీయాలను ఔపాసన పట్టిన వారి అభిప్రాయాల ప్రకారం.. త్వరలోనే కవితకు.. ప్రాధాన్యమైన పదవి లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అది పార్టీలోనా… ప్రభుత్వంలోనా అన్నది తేలాల్సి ఉంది. కేసీఆర్ రాజకీయ వ్యహాల గురంచి తెలిసిన విపక్ష నేతలు .. ఆమెపై ఇప్పటి నుండే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీని వల్ల ఆమె ప్రాధాన్యత వెలుగులోకి వస్తోంది కానీ… కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అది మారే అవకాశం లేదు.