ఆనందయ్య మందు అమ్ముతామంటూ ఓ వెబ్ సైట్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో విపరీతంగా ఫార్వార్డ్ అయింది. అందులో ఆనందయ్య మందును రూ. 167 కి అమ్ముతామని ఉంది. అయితే.. తాను ఆన్లైన్లో మందు అమ్మడం లేదని ఆనందయ్య చెప్పడంతో అదంతా ఫేక్ అని తేలింది. ఈ వెబ్ సైట్ తయారు చేసిన కంపెనీ పేరు శ్రేషిత టెక్నాలజీస్. పెద్దగా ఊరూపేరూ లేని ఈ కంపెనీ వివరాలను తెలుసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సన్నిహితులదిగా గుర్తించి.. పెద్ద స్కామ్ చేయబోయారని మీడియా ముందు ఆరోపించారు. వెంటనే ఆ కంపెనీకి కోపం వచ్చింది.
హైదరాబాద్లో రిజిస్టర్ అయిన ఆ కంపెనీ నేరుగా కృష్ణపట్నం వచ్చి ఫిర్యాదు చేస్తే.. వెంటనే సోమిరెడ్డిపై పోలీసులు కేసు పెట్టేశారు. వెబ్సైట్ను పూర్తిగా డెలవప్ చేయలేదని.. మా డేటాను చోరీ చేశారని.. ప్రజల మంచి కోసమే వెబ్ సైట్ రూపొందించామని శ్రేషిత టెక్నాలజీ ఎండీ నర్మద్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాము వైసీపీ అభిమానులమేనని.. అయితే.. ఆనందయ్య మందుతో వ్యాపారం చేయాలనుకోలేదన్నారు. తాము ఆనందయ్య మందు అమ్ముతామని అధికారికంగా వెబ్ సైట్ లాంఛ్ చేయలేదని చెప్పుకొచ్చారు. అటు పోలీసులకు నర్మద్ రెడ్డి ఫిర్యాదు చేయగానే.. ఇటు సోమిరెడ్డిపై కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆనందయ్య మందును బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలనుకున్న నర్మద్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది పోయి.. అతను వచ్చి ఫిర్యాదు చేశాడని సోమిరెడ్డిపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా మందు అమ్మేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోకుండా.. సోమిరెడ్డిపై కేసు పెట్టడం..ఏపీలో ప్రత్యేకంగా అమలవుతున్న రాజారెడ్డి రాజ్యాంగంలోనే ఉంటుందన్నారు. శ్రేషిత కంపెనీ చేసిన ఫిర్యాదులో కనీస ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.