కలుస్తానని కబురు పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రుల నుంచి సానుకూల స్పందన రాలేదు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు రోజుల నుంచి సీఎంవో అధికారులు ప్రయత్నాలు చేయడంతో అమిత్ షా కార్యాలయం.. శనివారం కాస్త సానుకూల ఫీడ్ బ్యాక్ ఇచ్చింది. సోమవారం సీఎం జగన్ ఢిల్లీకి వచ్చిన తర్వాత… అమిత్ షా సమయం కేటాయిస్తారని.. సమాచారం ఇచ్చారు. దాంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు.. సీఎం జగన్ .. ఢిల్లీ పర్యటన అంటూ.. మీడియాకు సమాచారం లీక్ ఇచ్చారు. జగన్ ఢిల్లీకి చేరగానే టైం ఖరారవుతుందని చెప్పారు.
ఇంకా పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు కూడా ఖరారయ్యాయని.. ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే.. ఆదివారం సాయంత్రానికి కేంద్రమంత్రులెవరూ.. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా కూడా .. అపాయింట్మెంట్ ఇచ్చేంత తీరికగా లేరని సమాచారం వచ్చింది. కొంత మంది కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చినా వారిని కలవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని నిర్ణయించుకోవడంతో ఢిల్లీకి వెళ్లకుండా ఆగిపోవాలని నిర్ణయించారు. ఇప్పటికీ.. కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. అమిత్ షా .. గురువారం రోజున కాస్త తీరికగా ఉండే అవకాశం ఉందని.. ఆ రోజున కలవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
నిజంగా ఓ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే.. కేంద్రమంత్రులు ప్రయారిటీగా ఇచ్చి అపాయింట్మెంట్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి పర్యటన గురించి మీడియాకు చెబుతారు. కానీ ఏపీ సీఎం అధికారులు.. ఈ విషయంలో ప్రతీ సారి ఫెయిలవుతున్నారు. మీడియాలో ఢిల్లీ పర్యటనల గురించి విపరీతంగా ప్రచారం జరగడం.. తర్వాత కేంద్రమంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ప్రచారం సాగడం కామన్ అయిపోయింది. దీన్ని జగన్ పీఆర్ టీం కరెక్ట్ చేసుకోలేకపోతోంది.