వివేకా హత్య కేసులో విచారణ జరిపేందుకు మరోసారి సీబీఐ టీం పులివెందులకు చేరుకుంది. విచారణ ప్రారంభించడానికి కొత్త టీం వస్తున్నట్లుగా.. ఉన్నత స్థాయి వ్యక్తులకు కూడా సమాచారం లేదు. కడపకు చేరుకునే రెండు, మూడు గంటల ముందు మాత్రమే.. అధికారులకు సమాచారం వచ్చింది. నిజానికి సీబీఐ అధికారుల విచారణపై అందరూ నమ్మకం కోల్పోయారు. స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి ప్రెస్‌మీట్ పెట్టి.. కడపలో..అలాంటి హత్యలు మామూలేనన్నట్లుగా మాట్లాడారని కన్నీరు పెట్టుకున్న తర్వాత ఇక.. ఆ కేసు కూడా తేలిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీబీఐకి కొత్త చీఫ్ వచ్చారు. ఆయన హయాంలో సీబీఐ పనితీరు మారిపోతుందన్న అంచనాల నడుమ విచారణకు రావడం… కొత్త చర్చలకు కారణం అవుతున్నాయి.
.
హైకోర్టు సీబీఐ విచారణకు అప్పగించిన తర్వాత సీబీఐఅధికారులు ఏదో ఒకటి చేస్తున్నామనిపించడానికి మాత్రమే విచారణ జరుపుతున్నారు. గత సీబీఐ అధికారుల విచారణ తీరు చూసి… ఒక్క పులివెందుల వాసులే కాదు… రాష్ట్రం మొత్తం ముక్కున వేలేసుకుంటుంది. వివేకా హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. క్రైమ్ లెక్కల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే.. మొదటి అనుమానితులు. హత్యను దాచి పెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండెటపోటు అని నమ్మంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.. గుండెపోటుతో మరణించారని.. ఉదయం పది గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటంచారు. అయితే.. అసలేం జరిగిందో.. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని.. ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.
డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ… ఎవరూ… ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం… వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచి పెట్టి… సాక్ష్యాలను తారుమారు చేసి… స్మూత్‌గా… అంత్యక్రియలు జరిపించేయాలని… ప్రయత్నించారనేది బహిరంగరహస్యం. అత్యంత దారుణంగా నరికేసినట్లుగా తేలడంతో.. ఇక హత్య అని ఒప్పుకోక తప్పలేదు. ఇంత స్పష్టంగా సీక్వెన్స్ ఉన్నప్పటికీ..సీబీఐ అధికారులు.. పాల వాళ్లను.. పని వాళ్లను ప్రశ్నించి సమయం వృధా చేసుకున్నారు కానీ… సాక్ష్యాలను మాయం చేసిన వారిని.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న వారిని మాత్రం… ఇంత వరకూ ప్రశ్నించలేదు.
వ్యవస్థకు అధిపతి ఎలా ఉంటారో.. ఆ వ్యవస్థ కూడా అలాగే పని చేస్తుంది. ప్రస్తుత సీబీఐ చీఫ్ బిశ్వాల్‌పై… దేశం మొత్తం అనేక ఆశలు పెట్టుకుంది.ఆ వ్యవస్థ సమర్థంగా పని చేస్తే.. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. ఎంతో మంది దోపిడిదారులు.. హంతకులు.. అవినీతి పరులు జైలుకు వెళ్తారు. దాని కోసం… అంతా ఎదురు చూస్తున్నారు.