ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఓ బలమైన బీసీ నేతను ఆకర్షించాలన్న టీఆర్ఎస్ ప్రయత్నాలకు మొదటి అడుగు పడింది. టీఆర్ఎస్ … తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మైండ్ గేమ్ ప్రారంభించింది. ఎల్.రమణ తమ పార్టీలోకి వస్తారని.. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని మీడియాకు లీక్ ఇచ్చారు. మొదట ప్రణాళిక ప్రకారం.. టీఆర్ఎస్లోకి ఎల్.రమణ అని ప్రచారం చేశారు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఎల్ రమణకు ఫోన్ చేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా ఎల్.రమణ వైపు నుంచి స్పందన లేదు.
ఎల్.రమణ పదవుల కోసం వెళ్లే రాజకీయ నేత అయితే.. ఎప్పుడో.. టీఆర్ఎస్లో చేరి ఉండేవారు. కానీ.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా .. పార్టీకే కట్టుబడి ఉండాలని ఆయన అనుకున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలను యాక్టివ్గా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఎల్.రమణనే కారణంగా చూపి.. చాలా మంది పార్టీ మారిపోయారు. ముఖ్యంగా ఎర్రబెల్లి లాంటి వాళ్లు టీడీపీని వదిలి పెట్టడానికి ఎల్.రమణనే కారణంగా చూపించారు. మిగిలిపోయిన పార్టీ నేతల్లోనూ కొంత మంది ఎల్.రమణ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆయనను మార్చాలని టీడీపీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారని కూడా చెప్పుకొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎల్.రమణకే తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించారు.
గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలను కాంగ్రెస్కు కేటాయించడంతో ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎల్.రమణ రాజకీయ భవిష్యత్ కోసం.. పునరాలోచించక తప్పదన్న అభిప్రాయానికి కొంత మంది వచ్చారు. అయితే ఎల్.రమణ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఈటల లాంటి బీసీ నాయకుడు టీఆర్ఎస్ కు దూరమైనందున… అదే బీసీ వర్గాల్లో క్లీన్ ఇమేజ్.. మంచి పలుకుబడి ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరితే బ్యాలెన్స్ అవుతుందని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే.. ఎల్.రమణ ఆలోచనలేంటో తెలియాల్సి ఉంది.