ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది రోజుల కిందట జిల్లాకో హెల్త్ హబ్ ప్రకటించారు. మరో మూడు ఎక్కువగా మొత్తం పదిహేడు వరకూ హెల్త్ హబ్‌లు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో అందరూ.. జగన్ నిర్ణయాన్ని ఆహా..ఓహో అన్నారు. దానికి సమగ్ర కార్యాచరణ ఎప్పుడో.. ఎప్పటికి భూసేకణ చేస్తారో.. ఎప్పటికి ఆస్పత్రులు కట్టడం ప్రారంభిస్తారో క్లారిటీ లేదు. వారం రోజుల కిందట… పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి.. గ్రాఫిక్స్ వదిలారు. వాటిని ఎప్పుడు కడతారో అన్న అనుమానపు చర్చలు ప్రజల్లో జరుగుతూ ఉండగానే.. తాజాగా.. మూడు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని ప్రకటించేశారు.
కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని సమీక్షలో తేల్చేశారు. వెంటనే.. కర్ఫ్యూ నిబంధనల సమయాన్ని సడలించారు. మధ్యాహ్నం పన్నెండు వరకూ ఉన్న వెసులుబాటును రెండు వరకూ ఇచ్చారు. ఆ తర్వాత ధర్డ్ వేవ్ గురించి చర్చ జరిగింది. ధర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువగా వైరస్ సోకే ప్రమాదం ఉందని అధికారులు చెప్పడంతో.. వెంటనే.. సీఎం జగన్ ముందస్తు చర్యలు ప్రకటించారు. వాటిలో ముఖ్యమైనది.. మూడు ప్రాంతాల్లో మూడు పిడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. మూడింటికి కలిపి దాదాపుగా రూ. 540 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు పిల్లలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్లో ప్రయారిటీ ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షల్లో అధికారులకు ఇచ్చే ఆదేశాలు.. ఆ తర్వాత అవి మీడియా ద్వారా.. విస్తృత ప్రచారం కల్పించుకోవడానికి చాలా బాగుంటున్నాయి. కానీ.. ఆ తర్వాత అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది ఫాలో అప్ చేసుకోవడం లేదు. ఫలితంగా రెండేళ్ల కిందట.. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ కూడా అమలు కాలేదన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కనీసం.. ధర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని భావి భారత పౌరుల కోసం అయినా తీసుకున్న నిర్ణయాలను పక్కాగా.. శరవేగంగా నిర్మించాలన్న అభిప్రాయం.. సామాన్య ప్రజల్లో వినిపిస్తోంది.