షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి వైఎస్ఆర్ పేరు వాడుకోవడంపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో.. వైఎస్ఆర్ టీపీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. కొద్ది రోజుల కిందట.. తమకు వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారని.. అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని.. ఈసీ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన మేరకు.. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో.. పేరు సారూప్యం ఉన్న పార్టీల నుంచి ఎన్వోసీలు కూడా ఆయా పార్టీలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు సమర్పిస్తారు.
ఇలా .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి లేఖ సమర్పించారు. నిజానికి గౌరవాధ్యక్షురాలిగా ఆమెకు అంత పవర్ ఉండదు. ఆ పదవి అలంకార ప్రాయమే. అసలు అధికారం అధ్యక్షుడిగా జగన్కు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి.. సోదరి పార్టీ విషయంలో అభ్యంతరం లేదని లేఖ రాయడానికి తీరిక దొరకలేదమో కానీ.. తల్లి విజయలక్ష్మినే రాశారు. ఆ లేఖను షర్మిల పార్టీ నేతలు.. ఈసీకి సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. నిజానికి ఈ పేరు విషయంలో చాలా వివాదాలున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిక్కులు వచ్చాయి. చివరికి కోర్టులో రిలీఫ్ లభించింది. ఈ కారణంగా పేరు సారుప్యం ఉన్న పార్టీల నుంచి అభ్యంతరం లేదన్న లేఖలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేపు.. వైఎస్ఆర్ టీపీ.. పార్టీపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి లేఖ ఇచ్చారు.. ఆ తర్వాత కూడా.. అభ్యంతరాలు చెప్పలేదు కాబట్టి… భవిష్యత్లో ఎప్పుడైనా… వైసీపీ .. అబ్జెక్ట్ చేస్తే.. ఈసీ ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉండదు.