ఎన్నికల్లో ఒక్కసారి గెలవడానికే గట్టి పోటీని ఎదుర్కోవడంలో నానా హైరానా పడుతుంటారు చాలా మంది నాయకులు. అలాంటిది వరుసగా విజయాలు సాధించడం, అంతకంతకూ పాత రికార్డులను చెరిపేయడం, కొత్త రికార్డులు తిరగరాయడం మామూలు విషయం కాదు. కేసీఆర్ నాయకత్వంలోని తెరాస రికార్డుల సాధనలో కొత్త పుంతలు తొక్కుతోంది. వరంగల్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయి మెజారిటీని సాధించడం చూసి అంతా షాకయ్యారు. తెరాస ప్రభుత్వ పనితీరు సరిగా లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోలేదు. 5 లక్షల ఓట్ల రేంజిలో మెజారిటీని కట్టబెట్టారు. కేసీఆర్ మ్యాజిక్ ఏమిటో అప్పుడు చాలా మందికి అర్థమైంది. కేటీఆర్, ఇంకా ఇతర నాయకులు ప్రచారానికి సారథ్యం వహించినా, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర హామీలతో మ్యాజిక్ చేసింది మాత్రం కేసీఆరే. గ్రేటర్ హైదరాబాద్ ప్రచార సారథి కేటీఆర్ అయినా, విజయానికి కావాల్సిన అస్త్ర శస్త్రాలను సమకూర్చిన వ్యక్తి కేసీఆర్. డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీతో డబుల్ ధమాకా సాదించవచ్చని ఆయనకు బాగా అర్థమైంది. హైదరాబాదులో సొంత ఇలు, అదీ రెండు పడకగదుల ఇంటిని ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందనే హామీ లక్షల మందిని ప్రభావితం చేసింది. ఇంకా ఇతర తాయిలాలు, హామీలు బాగా పనిచేశాయి. 150 డివిజన్లకు గాను 99 చోట్ల కారు దూసుకుపోయింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. వరసగా ప్రతి ఎన్నికల్లో తమ పార్టీని విజయపథంలో నడిపే సమర్థులైన నాయకులు మన దేశంలో చాలా అరుదు. త్రిపుర సీపీఎం ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ 1998 నుంచి అధికారంలో ఉన్నారు. వరసగా నాలుగు ఎన్నికల్లో ఆయన తమ పార్టీని గెలిపించారు. జన రంజక పాలనతో విజయాలు సాధిస్తున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అంతే. మొదటగా 2000 మార్చిలో తన పార్టీకి ఘన విజయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా వరసగా 2005, 2010, 2015 ఎన్నికల్లోనూ బీజేడీ విజయఢంకా మోగించేలా ప్రజల మద్దతు పొందారు. నిజాయితీ గల నాయకుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో ఇలాంటి మ్యాజిక్ నే చేశారు. అక్కడ భయానక భూకంపం సంభవించిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ స్థానంలో బీజేపీ నాయకత్వం మోడీని ముఖ్యమంత్రిని చేసింది. 2001 అక్టోబర్ 7న ఆయన బాధ్యతలు స్వీకరించారు. భూకంప బాధితులకు సత్వరం సహాయ పునరావాసం కల్పించారు. విద్యుత్ రంగంలో విప్లవం సృష్టించారు. 2002, 2007, 2012 ఎన్నికల్లోనూ బీజేపీకి ఘన విజయం సాధించిపెట్టారు. సీపీఎం సీనియర్ నాయకుడు జ్యోతిబసు ఏకబిగిన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5 వరకూ ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అయితే, బెంగాల్ లో పరిస్థితి వేరు. సీపీఎం క్యాడర్ అక్కడి విజయంలో కీలక పాత్ర పోషించేది. విజయం కోసం వివిధ పద్ధతుల్లో ప్రయత్నించడం, విమర్శలను లెక్కచేయకపోవడం అక్కడి ప్రత్యేకత. వ్యవస్థీకృత రిగ్గింగ్ కు బెంగాల్ పెట్టింది పేరనే ముద్ర పడింది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు ఏదో తాయిలం ఇవ్వాలి. ఊరించే హామీలివ్వాలి. వావ్ అనిపించే పని ఒక్కటైనా చూపించాలి. ఈ సూత్రాన్ని కేసీఆర్ బాగా ఫాలో అయ్యారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీ తారకమంత్రంలా పనిచేసింది. కట్టింది ఒకే భవనం. దాన్ని చూపించే వరంగల్, హైదరాబాద్ లో రికార్డు స్థాయి విజయాలను సాధించారు. ప్రతి ఒక్క కుటుంబం తమకు రెండు పడకగదుల ఇల్లు రాబోతోందని భావించే పరిస్థితి వచ్చింది. పేదలకు ఊహించని విధంగా మంచి రోజులు వస్తాయని గులాబీ శ్రేణులు ఆశలు కల్పించాయి. ఇదే కారు జోరుకు ప్రధాన ఇంధనమైంది. నల్లా, కరెంటు బిల్లు బకాయిల మాఫీ మరింత ప్రభావం చూపింది. ఆస్తి పన్ను భారీగా తగ్గించారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ ను ఓ యూత్ ఐకాన్ గా ప్రమోట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. బస్తీల్లో, కాలనీల్లో, అన్ని ప్రాంతాల వారి మద్దతు పొందడానికి కేసీఆర్ పక్కా వ్యూహరచనతో బరిలోకి దిగారు. దేశంలో అప్రతిహతంగా జైత్రయాత్రను కొనసాగించే అతి కొద్ది మంది అరుదైన నాయకుల్లో ఒకరయ్యారు.