ఈ వేసవి కరోనా ఖాతాలో కొట్టుకెళ్లిపోయింది. చిత్రసీమకు వేసవి రూపంలో బంగారం లాంటి సీజన్ ఉంటుంది. అదంతా కరోనా దెబ్బకు మటాష్ అయిపోయింది. అయితే… జూలై నుంచి చిత్రీకరణలు మొదలవుతాయని, ఆగస్టు నాటికి థియేటర్ల తాళాలు తెరచుకుంటాయని వస్తున్న వార్తలు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పరిస్థితులు చక్కబడతాయన్న ధీమా.. తమ సినిమాలు మళ్లీ థియేటర్లలో ఆడతాయన్న నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే వాళ్లంతా తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు బడా నిర్మాతలందరి దృష్టీ దసరా సీజన్‌పై పడింది. సంక్రాంతి, వేసవి తరవాత… కీలకమైన సీజన్ దసరాకే. వేసవి ఎలాగూ దాటేసింది. కనీసం దసరానైనా వాడుకోవాలన్న ఆలోచన.. బడా నిర్మాతలలో కనిపిస్తోంది.
ఆగస్టు నుంచి థియేటర్లకి, 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పెద్ద సినిమాలు తొందరపడిపోవు. పరిస్థితిని కాస్త గమనిస్తాయి. ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారా? ఇది వరకటి ఉత్సాహం ఉందా? అనే విషయాలన్ని పరిశీలించడానికి అది అనువైన సమయం. దసరాకి… మరింత వాతావరణం మరింత అనువుగా మారుతుంది. కాబట్టి… పెద్ద సినిమాలకు అదే సరైన సమయం. అందుకే ఇప్పుడు బడా నిర్మాతల టార్గెట్ దసరా అయ్యింది.
బాలకృష్ణ నటించిన అఖండ ని దసరా బరిలో నిలపాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జులైలో అఖండ షూటింగ్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ షూటింగ్ అయ్యేంత వరకూ నిరాటంకంగా సాగించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు.. చిరు `ఆచార్య`దీ ఇదే దారి. మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందని ఇది వరకే కొరటాల శివ ప్రకటించారు. అంటే… జులైలో షూటింగ్ ముగుస్తుంది. ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయినా.. దసరాకి బొమ్మ సిద్ధమవుతుంది. ప్రభాస్ `రాధే శ్యామ్` గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి కూడా మరో 10 రోజులు షూటింగ్ మిగిలి ఉంది. అది పూర్తి చేయడానికి చిత్రబృందం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. పక్కాగా ప్లానింగ్ చేసుకుంటే.. దసరాకి రాధే శ్యామ్ రెడీ అయిపోతుంది. జులై నుంచి దసరా లోగా ఇప్పటికే పూర్తయిన టక్ జగదీష్, విరాటపర్వం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ లాంటి సినిమాలు రావడానికి అనువుగా ఉంటుంది. అంటే.. జులైలో కొత్త సినిమాల సందడి మొదలైతే… అది దసరా వరకూ నాన్ స్టాప్ గా సాగబోతోందన్నమాట. మరి దసరా బరిలో ఈ మూడేనా? ఇంకా కొత్తగా ఏమైనా సినిమాలు వస్తాయా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.