రఘురామకృష్ణరాజును సైలెంట్ చేసేందుకు వైసీపీ హైకమాండ్ నలుగురు ఎంపీలకు బాధ్యతలిచ్చింది. ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపింది. ఇప్పటి వరకూచ చేస్తున్న రచ్చతోనే.. చాలా వరకూ.. ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. ఇక ముందు ఆయన నోరు తెరవకుండా ఉండాలంటే ఏం చేయాలో… చెప్పి వారికి దిశానిర్దేశం చేసి పంపారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎటాక్ తగ్గించింది. పెద్దగా ఎవరూ విమర్శలు చేయడం లేదు. సోషల్ మీడియాలోనూ దూషించడం లేదు. అంతకు ముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే… సోషల్ మీడియా డైరక్టర్ పేరుతో ప్రభుత్వ జీతం తీసుకుంటూ… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా వ్యవహరించే… వ్యక్తి.. రఘురామపై బూతులతో దాడి చేసేవారు. ఇప్పుడు అతన్ని కూడా సైలెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
కొద్ది రోజులుగా రఘురామ… సీఐడీ కేసుపై ఎక్కడా మాట్లాడటం లేదు.కానీ.. ఆయన రాష్ట్రపతి నుంచి ప్రతి రాజ్యాంగ వ్యవస్థకు లేఖలు రాస్తున్నారు. తాజాగా గవర్నర్లకూ లేఖలు రాశారు. ఏపీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, రాజద్రోహం కేసు మోపారని ఆరోపించారు. రాజద్రోహం సెక్షన్ 124(A)ను తొలగించాలని కోరారు. జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా తనపై కక్షగట్టి కేసులు మోపి హింసించారని ఆయా లేఖల్లో చెబుతున్నారు. ఎంపీలు, సీఎంలకు రఘురామ లేఖలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు నేతలు వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారు.
దీంతో సలహాదారుడు సజ్జల నలుగురు ఎంపీల్ని పిలిచి ప్రత్యేకంగా టాస్క్ అప్పగించారు. ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపారు. అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ అపాయింట్ మెంట్లను వెంటనే తీసుకోవాలని నిర్దేశించారు. వీరితో పాటు… రఘురామ లేఖలు రాస్తే స్పందించిన వారినందర్నీ వైసీపీ నేతలు ప్రత్యేకంగా కలిసి.. తమ వెర్షన్ వినిపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకూ… రఘురామరాజుపై ఒత్తిడి తెచ్చి..ఆయన సైలెంటయ్యేలా చూడాలని.. రకరకాల ప్లాన్లు అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.