రవితేజ… చేతిలో హిట్లు ఉన్నా, లేకున్నా…. ఫుల్ స్వింగ్ లో ఉండే హీరో. ఇప్పుడైతే బండి యమ జోరుగా ఉంది. తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కానీ విచిత్రంగా ఒక్కో సినిమా చేజారుతోంది. మొన్నటికి మొన్న.. నక్కిన త్రినాథరావు తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది.
`నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా`తో దర్శకుడిగా మారిన రచయిత… వక్కంతం వంశీ. తన రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని తెలుస్తోంది. రవితేజ బిజీ షెడ్యూల్ వల్ల… వక్కంతంకి డేట్లు ఇవ్వలేకపోవడం, వక్కంతం మరో హీరోని అప్రోచ్ అవ్వడం జరిగాయి. ఆ హీరో ఎవరో కాదు.. నితిన్. తను వక్కంతం చెప్పిన కథకు ఓకే అన్నాడట. దాంతో.. రవితేజతో చేయాల్సిన సినిమా, ఇప్పుడు నితిన్ దగ్గరకు చేరిందని టాక్. నితిన్ చేయాల్సిన `పవర్ పేట` రీమేక్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ `పవర్ పేట` కోసం… ఉంచిన కాల్షీట్లే.. ఇప్పుడు వక్కంతంకి ఇస్తున్నాడట. మరి రవితేజ కోసం రాసుకున్న కథనే.. నితిన్ తో చేస్తున్నాడా, లేదంటే నితిన్ కోసం కొత్త కథ రాసుకున్నాడా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.