ప్రముఖ గీత రచయిత కందికొండ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం క్రితం ఆయనకు కాన్సర్ సోకింది. ఆ వ్యాధి నుంచి ఆయన కాస్త కోలుకున్నట్టు కనిపించింది. ఇంతలో మళ్లీ… అనారోగ్యం పాలయ్యారు.
మళ్లికూయవే గువ్వా (ఇట్టు శ్రావణి సుబ్రహ్మణ్యం), చెన్నై చంద్రమా (అమ్మా నాన్న తమిళ అమ్మాయి) లాంటి సూపర్ హిట్ గీతాలు ఆయనవే. పల్లెటూరి పదాలంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణ జీవనాన్ని ఉట్టిపడేలా పాటలు రాయడంలో సిద్ధహస్తుడు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌కి సాహిత్యం అందించారు. బతుకమ్మ, బోనాల సందర్భంలో.. వినిపించే పాటల్లో ఎక్కువగా కందికొండ కలం నుంచి జాలువారినవే. చిత్రసీమలో.. పూరి జగన్నాథ్ అత్యంత సన్నిహితుడు. తన సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు పూరి. కొన్నాళ్లుగా కందికొండ రచయితగానూ చిత్రసీమకు దూరంగానే ఉన్నారు.కందికొండ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం… ఆయనకు వైద్యం చేయించే స్థితిలో కూడా కుటుంబ సభ్యులు లేకపోవడం దురదృష్టకరం. చిత్రసీమే.. కందికోండను ఆదుకోవాలిక.
కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు.ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడారు.
కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిలషించారు.