వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలపై దృష్టి పెట్టారు. లేఖలు రాయడానికే తన సమయం మొత్తం కేటాయిస్తున్న రఘురామకృష్ణరాజు.. ఇప్పటి వరకూ.. తనపై సీఐడీ అధికారులు చేసిన దాడిని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా … జగన్ ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. పేదల పెన్షన్లపై లేఖ సంధించారు. నేరుగా జగన్‌కే లేఖ రాశారు.
రెండేళ్ల కిందట.. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వృద్ధాప్య పించన్లను.. ఏటా రూ. 250 చొప్పున పెంచుకుంటూ పోతామని హమీ ఇచ్చారు. ప్రమాణస్వీకార వేదికపై తొలి సంతకం చేశారు. అయితే అప్పుడు పెంచిందే పెంపు.. మళ్లీ పెంచలేదు. దీంతో వివిద వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్షేమ షెడ్యూల్లో పెన్షన్ల పెంపునకు చోటు దొరకలేదు. వచ్చే ఏడాది పెంచుతామన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీనిపై రఘురామకృష్ణరాజు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా లేఖ రాసి.. వృద్దాప్య పెన్షన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ఈ నెల నుంచి పెన్షన్‌ను రూ.2,750కు పెంచి ఇవ్వాలని.. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కూడా కలిపి రూ.3 వేలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని.. గుర్తు చేశారు. నిజానికి ఈ అంశంపై చాలా కాలంగా పెన్షనర్లలోనూ చర్చ జరుగుతోంది. వాలంటీర్లను అడుగుతూనే ఉన్నారు. వారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.