తెలంగాణ సర్కార్ కూడా నిధుల్ని సమీకరించుకోవడానికి ఆస్తులు అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే పొరుగు రాష్ట్రం ఏపీలోలాగా.. మార్కెట్లు… క్వార్టర్లు.. కలెక్టరేట్లను కాకుండా.. అచ్చంగా అందుబాటులో ఉన్న భూముల్నే అమ్మాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ.. ప్రాజెక్టుల రీడిజైన్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వీటి కోసం దాదాపుగా లక్ష కోట్ల వరకూ ఖర్చయ్యాయి. అత్యధికం అప్పులే. ఆదాయానికి కరోనా గండం వచ్చి పడింది. ఇప్పుడు.. ఆర్థిక నిర్వహణ భారంగా మారింది. దీంతో భూములు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అమ్మాల్సిన భూముల లెక్కలు తీశారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకాలు పూర్తయ్యే చాన్స్ ఉంది. ఇందు కోసం తెలంగాణ సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీని.. భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ.. భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ- వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయించాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్ముతామని బడ్జెట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వానికి, హౌసింగ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల భూములు ఉన్నాయి.
వీటిని అమ్మితే సుమారు 35 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్ నలుదిశలా ఉన్న భూములతో 5 వేల కోట్ల బిజినెస్ చేసే భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాలు ఆదాయం కోసం భూముల్ని అమ్మడం సహజమే. శివారు ప్రాంతాలను అభివృద్ధి చేసి.. ఆ ప్రాంతాలను అమ్మి ప్రజాభివృద్ధికి ఖర్చుపెట్టడం కామనే. అయితే అవాంతరాలు లేకుండా ముందుకు సాగడమే కీలకం.