అభ్యుదయ భావాలు, విప్లవం, వర్గ పోరాటం, కులాల చిచ్చు, మతాల మారణహోమం… ఇవి సైతం వెండి తెరపై కథలుగా వచ్చాయి. కదిలించాయి. పీడిత ప్రజల వైపు నిలబడి మాట్లాడిన ప్రతీసారీ జనం జేజేలు పలికారు. కొత్త ఆలోచనల్ని రేకెత్తించిన ప్రతిసారీ హారతులు పట్టారు. అయితే.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడం కత్తిమీద సాము. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిపై బలమైన అవగాహన, లోతైన పరిశీలన జరగాలి. ఆయా సన్నివేశాలు మనిషిలోని భావోద్వేగాల్ని తట్టిలేపాలి. లేదంటే అదంతా దర్శకుడి అరణ్యరోదనగా మిగిలిపోతుంది. ‘అర్థ శతాబ్దం’లోనూ దర్శకుడు కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకున్నాడు. కానీ.. దాన్ని తెరకెక్కించిన తీరు ఎలా ఉంది? ఎవరిని కదిలించింది? ఆహాలో విడుదలైన ఈ సినిమా గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుంటే…
అది సిరిసిల్ల. అక్కడి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవాలని చూస్తుంటారు. ఆ ఊరివాడే కృష్ణ (కార్తీక్ రత్నం). దుబాయ్ వెళ్లి, బాగా సంపాదించి.. అమ్మాచ చెల్లెల్ని బాగా చూసుకోవాలన్నది కోరిక. చిన్నప్పటి నుంచీ పుష్ష (కృష్ణ ప్రియ) అంటే చాలా ఇష్టం. తన వెనకే తిరుగుతుంటాడు. కానీ.. పుష్ష తనని పట్టించుకోదు. ఊర్లో బాబాయ్ (గౌతమ్ రాజు) కొట్టు దగ్గర.. ఓ పూల మొక్క ఉంటుంది. ఆ మొక్కకి పూచిన పువ్వంటే పుష్షకి ఇష్టం. అందుకోసం రోజూ.. ఆ మొక్క దగ్గరకు వస్తుంటుంది. ఆ మొక్కకి పూచిన పువ్వు కోసి.. అది పుష్ష చేతిలో పెట్టి, తన మనసులోని మాట బయటపెట్టాలన్నది కృష్ణ ఆలోచన. అయితే ఈలోగా.. ఆ పువ్వు ఎవరో కోసుకెళ్లిపోతారు. అదంతా.. ప్రత్యర్థి వర్గం పనే అనుకుని… కృష్ణ, అతని స్నేహితులు ప్రత్యర్థిపై దాడి చేస్తారు. అది కాస్త కులాల మధ్య కుమ్ములాట గా మారిపోతుంది. ఊర్లో ఒకరికొకరు నరుక్కునే వరకూ వెళ్తుంది. ఊరంతా రక్తపాతమయం. మరి… ఈ అరాచకం ఎలా ఆగింది? వర్గాల మధ్య పోరాటం ఎంత వరకూ వెళ్లింది? అనేది మిగిలిన కథ.
ఈ కథలో… దర్శకుడు చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు. ప్రేమ దగ్గర్నుంచి – రాజ్యాంగం వరకూ. కుల పోరాటం దగ్గర్నుంచి, మనిషి పుట్టుక వరకూ. ఇలా అన్నీ. కానీ దేనికీ పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఓ పువ్వు కోసం ఊరు ఊరంతా వల్లకాడుగా మారడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత గోల అవసరమా? అని ప్రేక్షకుడు అనుకుంటాడని.. దర్శకుడికీ తెలుసు. అందుకే శుభలేఖ సుధాకర్ పాత్రని సృష్టించి.. గుప్పెడు మిరియాల కోసం దేశం మొత్తం బానిసత్వంలో బతికింది.. పువ్వు కోసం ఓ ఊరు కొట్టుకోవడం తప్పులేదంటూ… కవరింగు చేసే ప్రయత్నం చేశారు.
ఏ కులం వాడు, ఏ పని చేయాలి? అనే పంచాయితీతో కథ మొదలవుతుంది. ఆ సీన్ చూస్తే… దర్శకుడు బలమైన విషయం ఏదో చెప్పాలనుకుంటున్నాడనిపిస్తుంది. కట్ చేస్తే.. లవ్ స్టోరీ మొదలైపోతుంది. అది కూడా వన్ సైడే. పుష్ఫ కోసం కృష్ణ పడే ఆరాటం కోసం రొటీన్ సన్నివేశాలతో దర్శకుడు కాలక్షేపం చేస్తాడు. పువ్వు ఎపిసోడ్ వచ్చేంత వరకూ… కథ సీరియస్ టర్న్ తీసుకోదు. అక్కడి నుంచి ఏదో అవుతుంది అనుకుంటే, అంతా రక్త పాతమే. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఇంత జరుగుతున్నా… మంత్రిగారు (శుభలేఖ సుధాకర్) డీఎస్పీ (అజయ్) ఇద్దరూ మిరియాల టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకుంటుంటారు. ప్రేమకథలో సీరియస్ సెన్ లేదు. కృష్ణ, పుష్ష ఇద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ల ప్రేమకు కులాలే అడ్డు అనుకోవడానికి లేదిక్కడ. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలో నిజాయతీ ఉండి, ఆ ప్రేమ కథ.. ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటే – పతాక సన్నివేశాలు ప్రేక్షకుడ్ని కదిలించేవి. అది లేకపోవడంతో – కులం కాటుకు వాళ్లిద్దరూ బలి అయినా, ప్రేక్షకుడిలో ఎలాంటి చలనం ఉండదు. నేటివిటీ కోసమో, సహజత్వం కోసమో.. బూతులు యదేచ్ఛగా వాడేశారు. రక్తపాతం, హింస మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో.. ”గతించిన క్షణాలన్నీ, గ్రంధాలుగా లిఖించబడినరోజున…కలవని అడుగులన్నీ కలయికగా కలబడే రోజు.. రాయని అక్షరాలని రాజ్యాంగంగా రాయబడిన రోజున..” అంటూ ఓ భారీ డైలాగ్ ఒకటి ఉంటుంది. అది సగం అర్థమై.. సగం అర్థం కాకుండా సాగుతుంది. ఈ సినిమా కూడా అలానే సాగింది.
కార్తీక్ రత్నం ఏ ఫ్రేములోనూ హీరోగా కనిపించడు. కృష్ణలానే బిహేవ్ చేశాడు. తన నటన సహజంగా ఉన్నా.. ఆ పాత్రని బలంగా తీర్చిదిద్దలేదు దర్శకుడు. పల్లెటూరి అమ్మాయిగా కృష్ణప్రియ పద్ధతిగా, సంప్రదాయంగా ఉంది. నవీన్ చంద్ర పాత్రని సగం సగం ఉడికించి, పొయ్యిమీద నుంచి దింపేశాడు దర్శకుడు. దాంతో ఆ పాత్ర ఫస్ట్రేషన్ ఏమిటో ప్రేక్షకుడికి పూర్తిగా అర్థం కాదు. సాయికుమార్ కి నక్సలైట్ నేపథ్యం ఉందని చూపించి, దాన్ని కేవలం ఒక్క సీన్ కే పరిమితం చేశారు.
పాటలు బాగున్నాయి. అర్థవంతంగా అనిపించాయి. ఈ సినిమాలో, సాంకేతిక నిపుణుల్లో ఎక్కువ మార్కులు సంగీతానికీ, సంగీత దర్శకుడికీ పడతాయి. ఏ కన్నులూ చూడని చిత్రమే.. పాట హృద్యంగా సాగింది. శంకర్ మహదేవన్ పాడిన పాట కూడా నచ్చుతుంది. దర్శకుడికంటూ ఓ భావజాలం ఉందని అర్థమైంది కానీ, అదేంటో ప్రేక్షకుడికి అర్థం కాదు. అదే.. ఈ సినిమాలోని లోపం.