” చదవేస్తే ఉన్న మతి పోయిందని ” పెద్దలు అంటూ ఉంటారు. చదువుకుంటే విఇజ్ఞానం పెరుగుతుందని మరింత విశాలంగా ఆలోచిస్తారని… సమస్యలను మరింత సులువుగా పరిష్కరిస్తారన్న అంచనాతో పెద్దలు ఉంటారు. పెద్దలే కాదు.. చదువు అనేది విజ్ఞానం పెంచుకోవడానికే అనుకుంటారు. కానీ.. తింగరి పనులు చేస్తే… సింపుల్‌గా చేయాల్సిన పనిని చింపి చేటంత చేసుకుంటనే… చాలా మందికి వీడికి చదవేస్తే ఉన్న మతిపోయిందని మెత్తబద్దవుతుది. ప్రస్తుతం దేశంలో ప్రజలకు టీకాలు వేసే పద్దతి చూసినప్పుడు.. ఆర్థికంగా.. సాంకేతికంగా.. వైద్య పరంగా ఎంతో ముందుకెళ్లినట్లుగా… ఇప్పటి వరకూ లెక్కలేసుకుంటున్న దేశం.. వాస్తవంగా వెనక్కి వెళ్లినట్లుగా సులువుగా అర్థం చేసుకోవచ్చు.
సెల్ఫోన్లు, కంప్యూటర్లు లేని కాలంలో స్పష్టమైన విధానంతో టీకాలు..!
భారతదేశంపై మహమ్మారులు దాడి చేయడం… ఒక్క కరోనాతో ప్రారంభం కాలేదు.. దాంతోనే అంతం కావు కూడా.ఒకప్పుడు మశూచి, పోలియో.. భారతీయుల్ని అతలాకుతలం చేశాయి. వాటి నుంచి ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రభుత్వాలు పకడ్బందీ వ్యూహాన్ని అవలంభించాయి. 1960ల్లో మశూచీ కారణంగా లక్ష మంది వరకూ చనిపోయారు. ఆ తర్వాత 1974లో ఆ మశూచీకే సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు మశూచి అనేదే లేదు. ఇంకా చెప్పాలంటే.. రెండు తరాల ముందే దాన్ని అంతం చేయగలిగారు. ఎలా అంటే అందరికీ టీకాలు వేయడం ద్వారానే. అప్పట్లోనే 30లక్షలమంది వైద్య సిబ్బంది… ఏడాదిన్నరలో దాదాపుగా అన్ని గ్రామాలు, నగరాల్లోని పది కోట్ల ఇళ్లకు తిరిగి టీకాలు వేశారు. నిజానికి అప్పట్లో ఏ సాంకేతికత లేదు. సెల్ ఫోన్లే కాదు.. అసలు ఫోన్లే అందుబాటులో ఉండటం తక్కువ. కంప్యూటర్ అనే పదం కూడా తెలీదు. అయినా.. అప్పుడు ఎంత పకడ్బందీగా చేశారంటే.. మశూచీ కేసులు 1975 నుంచి ఒక్కటంటే ఒక్కటీ వెలుగు చూడటం లేదు. పోలియో విషయంలోనూ భారత్ అదే పోరాట స్ఫూర్తి ప్రదర్శించింది. భారత్‌ను మెలిపెట్టిన మహమ్మారుల్లో పోలియో కూడా ఒకటి. 2009లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలియో కేసుల్లో భారత్ వాటా 60శాతం. 2011 తరవాత పోలియో కేసులు నమోదవడం ఆగిపోయింది. ఈ రెండేళ్లలో…దేశం నుంచి పోలియోను తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా శ్రమించింది. ఓ ఉద్యమాన్ని చేశారు. ఇది పబ్లిసిటీ..పార్టీలకు అతీతంగాసాగింది. అందుకే సక్సెస్ అయింది. ఏమీ లేని కాలంలో అద్భుతంగా చేసిన ఆ టీకాల కార్యక్రమం ఇప్పుడు కరోనా టీకాలకు వచ్చేసరికి..ఎలా చేయాలో తెలియక గందరగోళ పరిస్థితికి భారత్ పడిపోయింది.
తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే వెనుకబాటే..!
భారత ప్రజలకు టీకాలు కొత్త కాదు. ప్రభుత్వాలకు టీకాలు వేయడం కొత్త కాదు. కానీ.. మారుతున్న రాజకీయ వ్యవస్థతో పాటే.. మారిపోతున్న పనితీరుకు మాత్రం.. టీకాలు వేయడం కొత్తే. అందుకే గతంలో నేర్చుకున్న పాఠాలన్నింటినీ మర్చిపోయారు. మహమ్మారుల్ని తరిమికొట్టిన గొప్ప పనితీరు నుంచి పూర్తిగా వెనుకబడిపోయిన వ్యవస్థలోకి వచ్చారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆయుధాలు గతం కంటే ఇప్పుడు ఎక్కువ. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక రంగం గణనీయంగా విస్తరించినా ప్రజల్ని కాపాడటంలో పూర్తిగా వెనుకబడిపోయారు. సమగ్ర టీకా విధానాలను రూపొందించి అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. విలువైన సమయాన్ని వృథా చేసింది. సుప్రీంకోర్టు తప్పుపట్టిన తర్వాతనే… మేలుకుంది. ఇప్పుడు 18 ఏళ్లు దాటినవారికందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించినా- 25శాతం టీకాల వాటాను ప్రైవేటు రంగానికి ఇచ్చింది. ఇది కూడా అనాలోచిత చర్య. ఎందుకంటే టీకాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వపరమైందే. టీకా పంపిణీలో అవకతవకలు, అధిక ధరలు, ఆక్సిజన్-ఔషధాల కొరత వంటివి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. వీటన్నింటిని సరి చేసుకోవడంలో కేంద్రం విఫలమయింది. అదే ప్రజలకు శాపంగా మారింది
ఒంటెత్తు పోకడలే దేశానికి.. ప్రజలకు నష్టం..!
కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వాలు క్రెడిట్ గేమ్ ఆడటంతోనే ప్రజలు బలి అయ్యారు. మహమ్మారిలో ముందుగా చూడాల్సింది ప్రజల ప్రాణాలను కాపాడటమే. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ పార్టీలు ఆ కోణంలోకి వెళ్లలేదు. ఏది చేస్తే…తమకు ఎంత రాజకీయలాభం వస్తుందో లెక్కలేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రజల ప్రాణాల్ని పట్టించుకోలేదు. చివరికి కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు అందించే సాయం కూడా ప్రచారానికే వాడుకుంటున్నారు. వారికి ఆ దుస్థితి రావడానికి తామే కారణమన్న స్పృహను రాజకీయ నేతలు చేయడం లేదు. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, విశ్రాంత దౌత్యవేత్తలు, ప్రముఖులు ప్రధానమంత్రికి వందల సంఖ్యలో లేఖలు రాశారు. సరైన విధానాలను అనుసరించాలని అభ్యర్థిస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ చెత్తబుట్టలోకి వెళ్లాయి. ఫలితంగా స్మశానాల ఎదుట క్యూలు కనిపించాయి.
తప్పు దిద్దుకుని ప్రజల కోసం ఆలోచించడమే అసలైన దేశభక్తి..!
సెకండ్ వేవ్ కాస్త శాంతిస్తోంది. విజయవంతంగా కరోనా వైరస్‌ను నియంత్రించామని ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం ప్రారంభిస్తాయి. పోయిన ప్రాణాలు పోగా.. మిగిలిన వారందర్నీ తామే కాపాడామని… ప్రభుత్వాలు చెప్పుకోవచ్చు. అదే రాజకీయం. కనీ కరోనా అనేది ఇప్పుడు వదిలి పెట్టేది కాదు.. వినాశనానికి దారి తీసే… మహా విపత్తు అని ఇప్పటికే స్పష్టమయింది. ధర్డ్ వేవ్ వస్తుందన్న సంకేతాలులేవని ఇప్పటికే.. ప్రభుత్వాల నుంచి నిర్లక్ష్యమైన సమాధానాలు వస్తున్నాయి. సెకండ్ వేవ్ కన్నా ముందుగా అదే రకమైన ప్రకటనలు వచ్చాయి. ఫలితంగా .. టీకాల్ని సొంత ప్రజలకు కాకుండా… ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. అదుకే.. సెకండ్ వేవ్ డెడ్లీగా మారింది. ఇప్పుడూ కూడా అలాంటి తప్పులే ప్రభుత్వాలు చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తప్పులు దిద్దుకుంటేనే ప్రజల్ని కాపాడతారు. అదే నిజమైన దేశభక్తి. బతికిన వాళ్లు బతుకుతారులే అనుకుని తమ రాజకీయం తాము చేసుకోవడం.. దేశద్రోహం…!